239 ఎకరాల్లో.. రూ.2,284 కోట్లతో..కొహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్
ABN , Publish Date - Jun 06 , 2026 | 04:08 AM
రంగారెడ్డి జిల్లా కొహెడలో ఔటర్ రింగు రోడ్డును ఆనుకుని 239 ఎకరాల్లో రూ.2,284.32 కోట్లతో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి....
నేడు సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన
అనంతరం భారీ బహిరంగ సభ
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల
ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించేలా ఆధునిక వసతులతో నిర్మిస్తామని వెల్లడి
హయత్‌నగర్/హైదరాబాద్ సిటీ, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా కొహెడలో ఔటర్ రింగు రోడ్డును ఆనుకుని 239 ఎకరాల్లో రూ.2,284.32 కోట్లతో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 4 ఎకరాల్లో నిర్మించనున్న సమీకృత సబ్ రిజిస్టార్ కార్యాలయ భవనానికి కూడా ఆయన భూమి పూజ చేయనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు వచ్చే అవకాశం ఉండటంతో.. దాదాపు 30 వేల మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటుతో 3 భారీ వాటర్ ప్రూప్ షెడ్లను అధికారులు వేయించారు. అలాగే వాహనాల పార్కింగ్ కోసం 30 ఎకరాల ప్రైవేటు భూమిని చదును చేసి అందుబాటులో ఉంచారు. కార్యక్రమాల ఏర్పాట్లను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించేలా రూ.2,284 కోట్ల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో అంతర్జాతీయ సమీకృత మార్కెట్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. కొహెడలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వ్యవసాయ, మార్కెటింగ్ రంగానికి మైలురాయిగా నిలవనుందన్నారు. ఓఆర్‌ఆర్ పక్కనే సమీకృత మార్కెట్ ఉండాలనే సీఎం ఆలోచనకు అనుగుణంగా 239 ఎకరాలను మార్కెట్‌కు ఉచితంగా కేటాయించామని తెలిపారు. మార్కెట్ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా 14 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి లబ్ధి చేకూరనుందని.. ఏటా మార్కెటింగ్ శాఖకు రూ.8 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని చెప్పారు. పండ్లు, పూలు, పాడి, మాంసం ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు జరిగేలా ప్రాజెక్టును నిర్మిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు రైతుల కష్టాలను కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయని.. బీఆర్‌ఎస్, బీజేపీలు సహాయ నిరాకరణ చేస్తున్నాయని మండిపడ్డారు. చామల మాట్లాడుతూ.. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్.. ఆనాడు మార్కెట్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉత్పత్తులను దేశ విదేశాల్లో అమ్ముకునేలా మార్కెట్ రూపుదిద్దుకుంటుందన్నారు.