Share News

రాములోరి పెళ్లికి సీఎం రేవంత్‌

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:32 AM

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రూ.100 కోట్ల నిధులతో చేపట్టనున్న.....

రాములోరి పెళ్లికి సీఎం రేవంత్‌

  • రూ.100 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం

  • ఆలయ ప్రాకార నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం

కొత్తగూడెం, మార్చి16 (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రూ.100 కోట్ల నిధులతో చేపట్టనున్న రామాలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్‌హౌ్‌సలో జిల్లా కలెక్టర్‌తో భేటీ అయిన తుమ్మల.. సీఎం పర్యటన ఏర్పాట్లు, జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు రూ.300 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అందులో భాగంగా తొలివిడతలో ఆలయ ప్రాకార నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తుమ్మల పేర్కొన్నారు. ‘భక్తుల సేవలో ప్రభుత్వం’ అనే నినాదంతో నవమి ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుపై గతంలో ప్రతిపాదించిన 2 స్థలాలను ఎయిర్‌పోర్టు అథారిటీ తిరస్కరించిన నేపథ్యంలో, భద్రాచలం-కొత్తగూడెం మధ్య ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్‌కు సూచించారు. రాష్ట్రప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆయిల్‌పామ్‌ సాగు సబ్సిడీలపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

Updated Date - Mar 17 , 2026 | 04:32 AM