విద్వేష ప్రసంగాల నియంత్రణకు చట్టం
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:53 AM
విద్వేష ప్రసంగాలను నియంత్రించడానికి చట్టాన్ని తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని తెస్తామన్నారు.
‘జమాతే ఉలేమా ఏ హింద్’ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): విద్వేష ప్రసంగాలను నియంత్రించడానికి చట్టాన్ని తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని తెస్తామన్నారు. శంషాబాద్‌లోని మెట్రో క్లాసిక్ గార్డెన్‌లో ‘జమాతే ఉలేమా ఏ హింద్’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. దేశం అభివృద్ధి చెందాలంటే అంతా కలిసిమెలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతల పరిరక్షణ చాలా అవసరమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఈ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు. కులగణన చేపట్టినప్పుడు రాష్ట్రంలోని మైనారిటీ జనాభాను కూడా లెక్కించామన్నారు. సుప్రీం కోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు మైనారిటీల జనాభా లెక్కలను అందించి, వారికి 4ురిజర్వేషన్లు అమలయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంటున్నారని.. ఆయనకు దమ్ముంటే తెలంగాణలో అధికారంలోకి రావాలని సవాల్ విసిరారు. ఒక పార్టీ అవయవ దానం చేయడం వల్ల బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగిందని పరోక్షంగా బీఆర్‌ఎ్‌సను ఉద్దేశించి అన్నారు. దేశంలో మెజారిటీ ప్రజలు, మైనారిటీలు కలిసి ముందుకు వెళ్లడానికి జమాతే సంస్థ పాటుపడుతోందని చెప్పారు. మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సంస్థ స్వచ్ఛందంగా సహకరించి, తాను ఢిల్లీ వెళ్లడానికి దోహదపడిందన్నారు. మైనారిటీల అండతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. గెలిచాక 8మంది మై నారిటీ నేతలకు కార్పొరేషన్ పోస్టులిచ్చామని, అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి మంత్రిని చేశామని చెప్పారు. మునిసిపల్ ఎన్నికల్లో మైనారిటీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు.