Sammakka-Saralamma jatara: నవ మేడారం!
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:59 AM
మేడారం మెరిసిపోతోంది.. సమ్మక్క-సారలమ్మ వనదేవతల గద్దెల ప్రాంగణం తళుక్కుమంటోంది.. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రానైట్ స్తంభాలపై చెక్కిన చిహ్నాలు.....
గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంతో సమ్మక్క-సారలమ్మ జాతరకు కొత్తరూపు
నేడు సాయంత్రం మేడారానికి సీఎం, మంత్రులు
అక్కడే మంత్రివర్గ భేటీ.. రాత్రికి బస
రేపు ఉదయం 7 గంటలకు గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
(వరంగల్, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
మేడారం మెరిసిపోతోంది.. సమ్మక్క-సారలమ్మ వనదేవతల గద్దెల ప్రాంగణం తళుక్కుమంటోంది.. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రానైట్ స్తంభాలపై చెక్కిన చిహ్నాలు, కూడళ్లలో ఆదివాసీల జీవన చిత్రాల అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. భవిష్యత్తు తరాలకు మేడారం చరిత్ర, ఆదివాసీల జీవన విధానాన్ని చాటిచెప్పేలా రూ.101 కోట్లతో ప్రభుత్వం చేపట్టిన గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు మహా జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గద్దెల ప్రాంగణం పునఃప్రారంభం జరగనుంది. ఆదివారం సాయంత్రమే మేడారానికి చేరుకోనున్న సీఎం.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి, రాత్రికి అక్కడే బస చేయనున్నారు. సీఎం, మంత్రుల పర్యటన, సమావేశం కోసం అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.
ఎట్లున్న మేడారం ఎట్లాయె!
దక్షిణ భారత కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర కొత్తరూపు సంతరించుకుంది. గద్దెల ప్రాకారాన్ని విస్తరించారు. ప్రాంగణం చుట్టూ 46 అ డుగుల వెడల్పుతో 3 స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు, 50 అడుగుల వెడల్పుతో ప్రఽధాన స్వాగత తోరణం నిర్మించారు. గతంలో సమ్మక్క, సారలమ్మ గద్దెలు ఒకవైపు.. పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు మరోవైపు ఉండేవి. పునర్నిర్మాణంలో భాగంగా ఒకేవరుసలో నిర్మించారు. దీనితో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటూ లోపలికి రావడానికి నాలుగు ద్వారాలు, అనంతరం బయటకు వెళ్లేందుకు 4ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రాకారం లోపల గతంలో 2,500 మంది భక్తులే ఉండేందుకు స్థలం సరిపోయేది. ఇప్పుడు 8, 9 వేల మంది భక్తులు ఒకే సమయంలో తల్లులకు మొ క్కులు చెల్లించుకునేలా విస్తరించారు. నలుగురు వనదేవతల గద్దెల వృత్తాకారంలో గ్రానెట్‌తో నిర్మించారు. రాతి స్తంభాల మధ్యలో వెదురుబొంగుల రూపంలో ఉన్న వన దేవతలను యథావిధిగా కొనసాగించారు. ఒక్కో గద్దె చుట్టూ 8 గ్రానైట్ స్తంభాలు ఏర్పాటు చేశారు. వాటిపై ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, చరిత్రను కళ్లకుకట్టేలా కళాకృతులను ఏర్పా టు చేశారు. మొత్తంగా 4 వేల టన్నుల గ్రానైట్‌తో పునర్నిర్మాణ పనులు జరిగాయి. 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన 7వేలకు పైగా శిల్పాలను ఏర్పాటు చేశారు. 930 ఏళ్లనాటి కోయ తాళపత్ర గ్రంథాల ఆధారంగా ఆ శిల్పాలకు రూపకల్పన చేశారు. సమ్మక్క, సారమ్మలతో పాటు ఆదివాసీల గొట్టుగోత్రాలను బొమ్మలుగా చెక్కారు. గద్దెల చుట్టూ బయటివైపు శిలలపై ఆదివాసీల జీవన విధానం, వారి దేవతలు, 750 కోయ ఇంటిపేర్లకు సంబంధించిన చిత్రాలను ఏర్పాటుచేశారు. వీటిని చూసిన భక్తులు ఎట్లున్న మేడారం ఎ ట్లాయె అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తంచేస్తున్నారు.
కనీసం రెండు శతాబ్దాలు నిలిచేలా..
మేడారం చరిత్ర, ఆదివాసీల పోరాట స్ఫూర్తి, జీవ న విధానం, గొట్టుగోత్రాల వివరాలు గుర్తుండేలా, క నీసం 200 ఏళ్లు చెక్కు చెదరకుండా నిలిచేలా వనదేవతల ప్రాంగణాన్ని ప్రభుత్వం పునర్నిర్మించింది. ఈ క్రమంలోనే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, జాతర చరిత్ర, సమ్మక్క-సారలమ్మ వంశస్తులైన దాదాపు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను గ్రానైట్ రాళ్లపై చిత్రాల రూపంలో చెక్కించింది.
రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మూడు నెలల్లోనే పునర్నిర్మాణం పూర్తి చేసిన గద్దెల ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభించి, వనదేవతలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ తదితరులతో కలిసి గద్దెలు, నూతన రోడ్లు, కూడళ్లలో నిర్మించిన ఆదివాసీల జీవన చిత్రాలను ప్రారంభించనున్నారు. తర్వాత జరిగే సభలో సీఎం ప్రసంగిస్తారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
రాత్రికి అక్కడే బస.. ప్రత్యేకంగా ఏర్పాట్లు
సీఎంతోపాటు పలువురు మంత్రులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆదివారం రాత్రి మేడారంలోని హరిత హోటల్‌లోనే బస చేయనున్నారు. వారి కోసం సుమారు 300 గదులను సిద్ధం చేశారు. మేడారం హరిత హోటల్‌తోపాటు తాడ్వాయి, లక్నవరం, రామప్ప, ములుగులో ఉన్న ప్రభుత్వ అతిథిగృహాలు, హరిత హోటళ్లను వారి కోసం కేటాయించారు. మేడారం హరిత హోటల్ సమీపంలో టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. అందులో కొందరికి బస ఏర్పాటు చేస్తున్నారు. అటవీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సుమారు 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నేడు మేడారంలో మంత్రివర్గ భేటీ..
ఆదివారం మేడారలోని హరిత హోటల్‌లో సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణపై ఈ భేటీలో తీర్మానం చేయనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదల, హ్యమ్‌రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పథకాలపైనా చర్చించే అవకాశముంది. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ అవతల జరుగుతున్న తొలి మంత్రివర్గ సమావేశంగా ఇది చరిత్రకు ఎక్కనుంది.