22న నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:25 AM
నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ....
సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అధికారులతో సోమవారం తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ నెల 22న ముఖ్యమంత్రి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి, రూ.80 కోట్లతో నిర్మించనున్న రిఫైనరీకి శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. ఏర్పాట్లను వేగిరం చేయాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్థ చూపాలని ఆదేశించారు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా పెద్ద సంఖ్యలో రైతులు వీక్షించే అవకాశం కల్పించాలని సూచించారు. ప్రారంభోత్సవం సందర్భంగా రైతుల సందర్శనార్థం ఈ నెల 20 నుంచి 22 వరకు రైతుమేళాను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ మేళాలో రైతుల కోసం వివిధ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు.ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని రైతులందరూ పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని తుమ్మల కోరారు. ఈ స్టాల్స్ ద్వారా రైతులకు అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతలు, ఆధునిక సాగు పద్ధతులు, ఆయిల్ పామ్ సాగు, ప్రాసెసింగ్ విధానాలపై సమగ్ర సమాచారం అందించాలని పేర్కొన్నారు.