హ్యామ్ పనులకు ముహూర్తం ఖరారు
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:32 AM
హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్)లో అభివృద్ధి చేయదల్చిన రోడ్ల ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. నల్గొండ జిల్లా కనగల్ దగ్గర నిర్మించిన ...
28న నల్లగొండకు సీఎం రేవంత్..!
ఆర్‌అండ్‌బీ హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన.. పైలాన్ ఆవిష్కరణ
హైదరాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్)లో అభివృద్ధి చేయదల్చిన రోడ్ల ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. నల్గొండ జిల్లా కనగల్ దగ్గర నిర్మించిన ఆర్‌అండ్‌బీ రోడ్ల హ్యామ్ ప్రాజెక్టు పైలాన్‌ను జూన్ 28న సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి, అనంతరం రోడ్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈమేరకు ప్రాథమిక షెడ్యూల్ ఖరారైందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించాలని ఆర్‌అండ్‌బీ శాఖ, నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయించారు. ఇందుకు వేదికగా నల్గొండ పట్టణంలోని ఎన్జీ గ్రౌండ్‌ను ఖరారు చేశారు. వర్షాలు, వాతావరణ పరిస్థితి, మంచి ముహూర్తాన్ని బట్టి 26 నుంచి 28వ తేదీ మధ్య శంకుస్థాపన చేసేలా మంత్రి కోమటిరెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఆర్‌అండ్‌బీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శ్రీను, ప్రతినిధులు మహేందర్ సహా పలువురు సచివాలయంలో మంత్రిని కలిశారు. కౌన్సెలింగ్, పదోన్నతులు, బదిలీలు ఒకేసారి చేపట్టాలని ఆయనను కోరారు.
ఆర్‌అండ్‌బీ రోడ్స్ సీఈగా బీవీ రావు
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలోని రహదారుల విభాగం చీఫ్ ఇంజినీర్‌గా బీవీ రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికా్‌సరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆర్‌అండ్‌బీ పరిధిలోని రోడ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా బీవీ రావునే నియమించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం బీవీ రావు హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) ప్రాజెక్టుకు చీఫ్ ఇంజినీర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని, హ్యామ్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.