Mahabubnagar: నేడు పాలమూరుకు ముఖ్యమంత్రి
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:19 AM
సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.1,463 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
రూ.1,463 కోట్లతో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 1284 కోట్ల పనులకు శ్రీకారం
రేపు పాలేరుకు సీఎంజే ఎన్టీయూ భవనాలకుశంకుస్థాపన
మహబూబ్‌నగర్/హైదరాబాద్ సిటీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.1,463 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ఒక్క మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోనే రూ.1,284 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మహబూబ్‌నగర్-జడ్చర్ల నియోజకవర్గాల సరిహద్దులో రూ.200 కోట్లతో ట్రిపుల్ ఐటీ నూతన క్యాంపస్ భవనానికి శంకుస్థాపన చేయనుండగా.. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.40 కోట్లతో నర్సింగ్ కాలేజీ పనులను ప్రారంభించనున్నారు. ఇటు మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో రూ.603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, రూ.220 కోట్లతో తాగునీటి వ్యవస్థ పునరుద్ధరణ, బలోపేతం పనులకు శ్రీకారం చుడతారు. జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి వద్ద గురుకుల పాఠశాలలో చిన్నారులతో ముచ్చటిస్తారు. ఎంవీఎస్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పాలమూరుకు రానున్న సీఎం 4 గంటలకు తిరిగి వెళ్తారు. ఈ నేపథ్యంలోనే ఎంవీఎస్ కళాశాల మైదానంలో సీఎం సభా ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. ఇక ఈనెల 18న సీఎం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం పాలేరు జేఎన్‌టీయూ కళాశాల భవనాలకు శంఖుస్థాపన చేయనున్నట్లు ఆ వర్సిటీ ఉన్నతాధికారులు వెల్లడించారు. 2023లో పాలేరుకు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కాగా, మూడేళ్లుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వినతి మేరకు పాలేరు జేఎన్‌టీయూ కళాశాల నిర్మాణానికి సర్కారు 30 ఎకరాలతో పాటు రూ.108 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే తొలిదశలో రూ.70 కోట్లు వెచ్చించి కొన్ని బ్లాక్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.