6న పిప్రిలో సీఎం సభ
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:16 AM
రాష్ట్రంలో జరుగుతున్న 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామంలో ప్రభుత్వం భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.
ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా నిర్వహణ
మూడేళ్ల క్రితం భట్టివిక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది పిప్రి గ్రామంలోనే
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరుగుతున్న 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామంలో ప్రభుత్వం భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. మూడేళ్ల కిందట భట్టివిక్రమార్క పిప్రి గ్రామంలోనే తన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ బహిరంగ సభకు ఆ గ్రామా న్ని ఎంచుకున్నారు. ఏప్రిల్ 6న తొలుత బాసరకు వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. గోదావరి పుష్కరాల సందర్భంగా అక్కడ చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బాసరలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు పిప్రికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా భట్టివిక్రమార్క ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు ఆ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పంపిణీ చేయనున్నారు. సీఎం సభకు ఏర్పాట్లపై శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలకు మాట ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. అందుకే తన పాదయాత్ర సందర్భంగా కొన్ని వర్గాలకు ఇచ్చిన హామీల అమలు పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఈ సభలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పాదయాత్ర సందర్భంగా సీఎల్పీ నేత హోదాలో ధరణిని రద్దు చేసి పారదర్శక వ్యవస్థను తీసుకువస్తామని హామీ ఇచ్చానని గుర్తుచేశారు. ఆ హామీ మేరకు అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ఇలా అనేక హామీలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్ సాగర్‌రావు, వెడ్మ బొజ్జు తదితరులు పాల్గొన్నారు.