మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై వివరించనున్న సీఎం
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:32 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు’ ప్రణాళిక గురించి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కూలంకషంగా వివరించనున్నారు.
13న ప్రజాప్రతినిధులు, మేధావులు, పార్టీల నేతలతో సమావేశం
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు’ ప్రణాళిక గురించి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కూలంకషంగా వివరించనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో ‘మూసీ ఆహ్వానం’ పేరిట తాజ్‌కృష్ణ హోటల్‌లో 13న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదిత ప్రణాళిక ఈ వేదికపై ఆవిష్కృతం కానుంది. పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ముఖ్య నేతలు, మేధావులు, పర్యావరణ నిపుణులు, పట్టణ ప్లానర్లు, ఆర్కిటెక్టులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. క్రెడాయ్, సీఐఐ, ఫిక్కి ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, విదేశీ దౌత్యవేతలు కూడా ఇందులో పాల్గొంటారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నగరంతో చరిత్రాత్మక అనుబంధాన్ని పెనవేసుకున్న మూసీ నది ఆనాటి పరిస్థితి, ఇప్పటి దుస్థితి, నగరానికి పొంచి ఉన్న ముప్పును విశ్లేషించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను ఈ వేదికపై వెల్లడించనున్నారు. మూసీ పునరుజ్జీవంతో స్వచ్ఛమైన నీటి ప్రవాహం, పర్యావరణ పరిరక్షణ, నదీ తీరాల అభివృద్ధి, ప్రజోపయోగ మౌలిక వసతుల ఏర్పాటు వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నది పునరుద్ధరణపై ప్రభుత్వ ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు, హైదరాబాద్ నగర భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్‌రెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.