Share News

CM Revanth Reddy to Attend Harvard: మళ్లీ విద్యార్థిగా రేవంత్‌!

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:28 AM

సీఎం రేవంత్‌రెడ్డి మరోమారు విద్యార్థి అయి.. క్లాసులకు వెళ్లనున్నారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీ..

CM Revanth Reddy to Attend Harvard: మళ్లీ విద్యార్థిగా రేవంత్‌!

  • హార్వర్డ్‌ యూనివర్సిటీలో వారం రోజుల కోర్సులో చేరనున్న సీఎం

హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి మరోమారు విద్యార్థి అయి.. క్లాసులకు వెళ్లనున్నారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీ.. ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం’ అనే అంశంపై నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సులో ఆయన చేరనున్నారు. మేడారం పర్యటన ముగిసిన వెంటనే పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం దావో్‌సకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఆ సదస్సు ముగిసిన తర్వాత.. ఈ నెల 23న అక్కడి నుంచి అమెరికాకు వెళతారు. హార్వర్డ్‌ కెనెడీ స్కూల్‌- ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సుకు సంబంధించి ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగే క్లాసులకు విద్యార్థిగా రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. కోర్సు ముగిసిన అనంతరం.. హార్వర్డ్‌ యూనివర్సిటీ అందజేసే సర్టిఫికెట్‌ను తీసుకొని అమెరికా నుంచి తిరుగు ప్రయాణమవుతారు. ఫిబ్రవరి 2న హైదరాబాద్‌కు చేరుకుంటారు. కాగా, హార్వర్డ్‌ కెనెడీ స్కూల్‌ నిర్వహిస్తున్న ఈ వారం రోజుల కోర్సు.. అనుభవజ్ఞులైన నాయకుల కోసం రూపొందించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. క్లిష్టమైన పరిస్థితుల్లో నాయకత్వం ఎలా ఉండాలి? అనిశ్చిత పరిస్థితులు, మార్పులు, విభేదాలను ఎలా ఎదుర్కోవాలి? అధికారంతో కాకుండా ప్రభావంతో ఎలా నడిపించాలి? అనే అంశాలు ఈ కోర్సులో ఉంటాయి. ఈ కోర్సును మసాచుసెట్స్‌లోని హార్వర్డ్‌ కెనెడీ స్కూల్‌ క్యాంప్‌సలో ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ సీనియర్‌ అధికారులు, కార్పొరేట్‌ కంపెనీల డైరెక్టర్లు, సీఈవోలు, సీనియర్‌ మేనేజర్లు, స్వచ్ఛంద సంస్థల నాయకులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కోర్సులో పాల్గొనేవారికి నాయకత్వం అంటే.. ఆచరణ, సంఘర్షణలను సానుకూలంగా ఎలా మలచుకోవాలి, ప్రజలను మార్పు వైపునకు ఎలా ప్రేరేపించాలి వంటి అంశాలను బోధిస్తారు. వ్యక్తిగత నాయకత్వ శైలిపై లోతైన విశ్లేషణా ఉంటుంది. బోధనా విధానం.. కేస్‌ స్టడీస్‌, గ్రూప్‌ డిస్కషన్స్‌, రియల్‌ లైఫ్‌ లీడర్‌షి్‌పలో ఎదురయ్యే సమస్యలపై చర్చ, స్వీయ ఆత్మపరిశీలన పద్ధతుల్లో ఉంటుంది. భారతదేశం నుంచి ఈ తరహా కోర్సుకు ప్రత్యక్షంగా హాజరై అభ్యసించనున్న తొలిసీఎం రేవంతే కావడం గమనార్హం.

నేడు దావో్‌సకు సీఎం..

సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం 10 గంటలకు దావో్‌సకు బయలుదేరి వెళ్లనున్నారు. మేడారం పర్యటనలో ఉన్న సీఎం.. ఉదయం 6.30 గంటలకు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్మించిన పైలాన్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత వనదేవతలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అనంతరం మేడారం నుంచి హెలికాప్టర్‌లో నేరుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు దావో్‌సకు బయలుదేరి వెళతారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఇప్పటికే దావో్‌సకు చేరుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి కూడా దావో్‌సకు వెళ్లనున్నారు. దావో్‌సలో పెట్టుబడుల సదస్సు ముగిసిన తర్వాత 23న సీఎం అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే హార్వర్డ్‌ కెనెడీ స్కూల్‌ నిర్వహిస్తున్న కోర్సుకు హాజరయ్యేందుకు రేవంత్‌రెడ్డి వెళుతుండటంతో.. ఆయన వెంట ఏ మంత్రి, అధికారీ వెళ్లడంలేదు. కాగా, కోర్సు ముగిశాక తిరిగి హైదరాబాద్‌కు ఫిబ్రవరి 2న చేరుకోనున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 04:28 AM