Share News

నోటిఫికేషన్లు ఇచ్చారు.. లీకేజీలతో అమ్ముకున్నారు

ABN , Publish Date - Jul 19 , 2026 | 05:41 AM

‘‘మేక తోలు కప్పుకొన్న ఓ తోడేలు ఇవాళ మాట్లాడుతోంది. మీరు నోటిఫికేషన్లు ఇస్తే మా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని నిస్సిగ్గుగా నడిబజార్లలో మాట్లాడుతున్నావు కదా? ఈరోజు నేను ఒక్కమాట అడుగుతున్నా..

నోటిఫికేషన్లు ఇచ్చారు.. లీకేజీలతో అమ్ముకున్నారు

  • ప్రశ్న పత్రాలను అమ్మి వందల కోట్లు సంపాదించారు

  • ఆ పరీక్షలు పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వలేదు

  • నిరుద్యోగుల్ని నాడు అసలు మనుషుల్లాగే చూడలేదు

  • వారి తల్లిదండ్రుల కళ్లలో మేం ఆనందాన్ని చూశాం

  • ప్రతి ఖాళీనీ భర్తీ చేసి నియామక పత్రం అందిస్తాం

  • తెలంగాణ మిమ్మల్ని శ్రీమంతుల్ని చేసింది.. మీరేమిచ్చారు?

  • మీ దోపిడీని ప్రజలు మరువలేదు.. తెలంగాణ క్షమించదు

  • అందెశ్రీ నా ఆత్మబంధువు.. సీఎంగా నిలబడడానికి స్ఫూర్తి

  • పదేళ్లపాటు ఆయన పాట వినిపించకుండా చేశారు

  • ‘అందెశ్రీ స్మృతి వనం’ భూమి పూజ కార్యక్రమంలో సీఎం

మేడ్చల్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ఘట్‌కేసర్‌: ‘‘మేక తోలు కప్పుకొన్న ఓ తోడేలు ఇవాళ మాట్లాడుతోంది. మీరు నోటిఫికేషన్లు ఇస్తే మా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని నిస్సిగ్గుగా నడిబజార్లలో మాట్లాడుతున్నావు కదా? ఈరోజు నేను ఒక్కమాట అడుగుతున్నా.. నోటిఫికేషన్లు ఇచ్చి.. ప్రశ్న పత్రాలను జిరాక్స్‌ సెంటర్లలో పల్లీ బఠాణీల మాదిరిగా అమ్ముకుని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు తప్పితే.. ఆ పరీక్షలు పూర్తి చేసి పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలనే ఆలోచన నీ కుటుంబానికి వచ్చిందా? నిరుద్యోగులు, ఉద్యోగ నియామకాల గురించి ఒక్క రోజైనా ఆలోచించారా? వారిని అసలు మనుషుల్లా చూశారా? మానవీయ కోణంలో చూశారా?’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆనాడు కవితను, వినోద్‌ను ప్రజలు తిరస్కరిస్తే వెంటనే ఉద్యోగాలు ఇచ్చారని, కానీ, తెలంగాణ బిడ్డల గురించి ఒక్కనాడైనా ఆలోచించారా? అని నిలదీశారు. ప్రజా కవి అందెశ్రీ 65వ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో రూ.4 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్న ‘అందెశ్రీ స్మృతివనం’ నిర్మాణానికి శనివారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘‘బీఆర్‌ఎస్‌ పాలనలో ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే దాదాపు 70 వేల ఉద్యోగాలిచ్చింది. నిరుద్యోగుల తల్లిదండ్రుల సాక్షిగా వారందరికీ నియామక పత్రాలిచ్చాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డంకులన్నీ తొలగించి గ్రూప్‌-1 నిర్వహించాం.


ఎల్బీ స్టేడియం, శిల్పకళా వేదిక సాక్షిగా తల్లిదండ్రుల ముందు బిడ్డలకు నియామక పత్రాలు అందజేశాం. ఆ తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూశాం’’ అని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులు మాయగాళ్ల వలలో పడవద్దని, ప్రభుత్వం ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేసి నియామక పత్రాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. నిరుద్యోగిగా ఉన్న బిడ్డ కవితకు పదేళ్లపాటు పదవి ఇచ్చుకున్నారని, కానీ, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మీకు గుర్తు రాలేదా? అని నిలదీశారు. ‘‘మా ప్రభుత్వంలో శంకరమ్మను, చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్‌ సభ్యులుగా నియమించాం. కోదండరాంను ఎమ్మెల్సీగా చేసుకున్నాం. 9 మంది కవులను సన్మానించి కోటి రూపాయల నగదు బహుమతి ఇచ్చి గౌరవించుకున్నాం’’ అని వివరించారు. ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తామని, ఉద్యమంలో అన్నీ కోల్పోయిన వారిని గుర్తించి ఆర్థికంగా ఆదుకుంటున్నామని చెప్పారు.


తెలంగాణ మిమ్మల్ని శ్రీమంతులను చేసింది

‘‘తెలంగాణ సమాజం మీకేమి తక్కువ చేసింది? ఆస్తులు ఇచ్చింది. అంతస్తులు ఇచ్చింది. శ్రీమంతులను చేసింది. మరి తిరిగి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మీ నలుగురు కుటుంబ సభ్యులు ఏం చేశారని తెలంగాణ సమాజం అడుగుతోంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిలదీశారు. దుబాయి పాస్‌పోర్టు బ్రోకర్‌ను ముఖ్యమంత్రిని, అమెరికాలో బాత్రూంలు కడిగిన ఆయన కొడుకును మంత్రిని చేసిందని చెప్పారు. బతుకమ్మ, బోనాలు వస్తే వసూళ్లు చేసే మీ చెల్లిని ఎమ్మెల్సీగా చేసింది కదా? అని ప్రశ్నించారు. చివరకు సారాలో సోడా పోసే సడ్డకుని కొడుకును కూడా ఎంపీ చేశారని మండిపడ్డారు. ‘‘నేను ఉన్నంత వరకు.. ప్రజలతో మమేకమైనంత వరకూ నిన్నూ, నీ కుటుంబాన్ని ఈ తెలంగాణ తులసి వనంలో గంజాయి మొక్కను మొలకెత్తనివ్వను. నీకు, మాకు పోలికేంది? మీ దోపిడీని ప్రజలు ఇంకా మరిచిపోలేదు’’ అని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ సమాజం అంతా గమనిస్తోందని, నిజాంను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ గడ్డదని, తెలంగాణ చైతన్యం ముందు మీరెంతని మండిపడ్డారు. తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదని, మళ్లీ మీరు తెలంగాణను చెరబట్టలేరని, చెరబట్టాలని చూస్తే అందెశ్రీ పాటగా తిరిగి వస్తాడని చెప్పారు. తమ ప్రభుత్వం అందెశ్రీ, గద్దర్‌, సోనియా గాంధీ స్ఫూర్తితో పని చేస్తుందని, మీకు నిజాం, ఖాసిం రిజ్వీ స్ఫూర్తినా!? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై అహంకారపూరితంగా ప్రవర్తించారని, ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టారని, ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేశారని, ప్రజలను కట్టు బానిసలుగా మార్చాలనుకున్నారని గుర్తు చేశారు.


వాళ్ల చేతి మీద గీత పడిందా!?

‘‘తెలంగాణ కోసం ఎంతో మంది అమరులయ్యారు. కల్వకుంట కుటుంబంలో ఒక్కరికైనా చేతి మీద గీత పడిందా!?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. గంజికి గతి లేని వాళ్లకు బెంజి వచ్చిందని, వీరంతా ఇప్పుడు నిజాంల కంటే ఆస్తిపరులు ఎలా అయ్యారని నిలదీశారు. ఫామ్‌హౌ్‌సలు ఎలా కట్టుకున్నారని ప్రశ్నించారు. ‘‘ప్రజా ప్రభుత్వం ఎందుకు పోవాలి? మీ కుటుంబం దోచుకునేందుకా? మీ కుటుంబ పదవుల కోసమా? మీరు మీ కుటుంబ సభ్యులు రికార్డు చేసుకోండి. రోజూ వినండి. 2034 వరకు ప్రజా ప్రభుత్వానిదే అధికారం. ఇదే భవిష్యత్తు. ఇదే చరిత్ర. మీకు గతమే తప్ప భవిష్యత్తు లేదు’’ అని పునరుద్ఘాటించారు. గజ్వేల్‌లో మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తామని శపథం చేశారు.

Updated Date - Jul 19 , 2026 | 05:42 AM