Share News

‘తాలీమ్‌ నుంచి తరక్కీ’ వైపు

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:57 AM

‘‘నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్య. ఆ తర్వాత స్కిల్‌, అప్‌స్కిల్‌, రీ స్కిల్‌ అనేది నా ఆలోచన. ప్రస్తుత ప్రపంచంలో ఉద్యోగ మార్కెట్‌ వేగంగా మారుతోంది.

‘తాలీమ్‌ నుంచి తరక్కీ’ వైపు

  • ముస్లిం యువత విషయంలో సర్కారు లక్ష్యం ఇదే..: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ‘‘నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్య. ఆ తర్వాత స్కిల్‌, అప్‌స్కిల్‌, రీ స్కిల్‌ అనేది నా ఆలోచన. ప్రస్తుత ప్రపంచంలో ఉద్యోగ మార్కెట్‌ వేగంగా మారుతోంది. కేవలం ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి సంప్రదాయ విద్యార్హతలతోనే ఉద్యోగం వస్తుందనే పరిస్థితి లేదు. జర్మనీ, జపాన్‌, దక్షిణ కొరియా, చైనా, తైవాన్‌ వంటి దేశాల్లో నైపుణ్యం కలిగిన వారికి భారీగా అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ యువత అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటే విదేశాల్లోనూ మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. అందుకే, స్కిల్‌ యూనివర్సిటీని ప్రారంభించి.. పాలిటెక్నిక్‌ విద్యను కూడా నైపుణ్యాభివృద్ధితో అనుసంధానం చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం కేవలం సంప్రదాయ డిగ్రీలపై ఆధారపడకుండా నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఆదివాసీ భవన్‌లో గురువారం జరిగిన ‘మైనారిటీ ఎక్సలెన్స్‌ సమ్మిట్‌’లో ఆయన మాట్లాడారు. మైనారిటీ కుటుంబాల్లోని తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను చదివిస్తున్నారని, ఆ పిల్లలు ఇప్పుడు ప్రభుత్వ అధికారులు, ఇంజినీర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, న్యాయవాదులు వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ఒకప్పుడు సామాజికంగా ఎదురైన అవమానాలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఉన్నత స్థానాలకు చేరుకున్న వారే విజయానికి నిదర్శనమని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నది ప్రజల కోసం పని చేయడానికేనని, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.


హజ్‌కు వెళ్లే వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కూడా ప్రభుత్వం తక్షణ సహాయం అందించిందని చెప్పారు. ‘‘మీకు కష్టం వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి. నేను అందుబాటులో ఉంటాను’’ అని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ‘‘‘తాలీమ్‌ నుంచి తరక్కీ’ (విద్య నుంచి అభివృద్ధి) దిశగా మైనారిటీ యువతను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వైఎస్‌ హయాంలో మైనారిటీలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్‌తో ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వచ్చారు. రిజర్వేషన్లను తొలగించేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. కోర్టుల్లోనూ కేసులు నడిచాయి. మైనారిటీల రిజర్వేషన్లను తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేవెళ్ల ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ ఉన్నంత వరకు సెక్యులర్‌ భావానికి భంగం కలగనివ్వం’’ అని స్పష్టం చేశారు. హిందువులు, ముస్లింలు వేర్వేరు కాదని.. తనకు రెండు కళ్లతో సమానమన్నారు. మైనారిటీ సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎప్పటికీ వివక్ష చూపదని, మైనారిటీ కుటుంబాల పిల్లలు కూడా విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ముందుకు రావడమే తన లక్ష్యమని చెప్పారు. మైనారిటీలు దేశానికి వ్యతిరేకమనే భావనను కొందరు వ్యాప్తి చేస్తున్నారని, అది సరికాదని అన్నారు. దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చే క్రీడాకారులను గుర్తించి తగిన ప్రోత్సాహకాలు అందించడం ప్రభుత్వ బాధ్యతని, అందుకే, బాక్సర్‌ నికత్‌ జరీన్‌, క్రికెటర్‌ సిరాజ్‌కు ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.


ప్రతి ఒక్కరూ ఒక రేవంత్‌ రెడ్డిగా మారి..

సర్‌ పేరుతో ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్‌ ఆరోపించారు. ‘బెంగాల్‌లో గెలిచాం.. ఇక మిగిలింది తెలంగాణే’ అంటూ కొందరు మాట్లాడుతున్నారని, బెంగాల్‌లో దీదీ వదిలేశారేమో కానీ, ఇక్కడ తమ కార్యకర్తలు వదిలిపెట్టరని హెచ్చరించినట్లు తెలిపారు. హైదరాబాద్‌, రంగారెడ్డి ప్రాంతాల్లో మైనారిటీ ఓటర్ల పేర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పేర్లు, ఇంటి పేర్లు, స్పెల్లింగ్‌లో చిన్న చిన్న తేడాల కారణంగా ఓటర్ల జాబితాలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. యువకులు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల ఓట్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. అవసరమైతే ప్రతి ఒక్కరూ ఒక రేవంత్‌ రెడ్డిగా మారి ఓటు హక్కును కాపాడాలని పిలుపునిచ్చారు.

Updated Date - Aug 14 , 2026 | 05:58 AM