Share News

సంగతి తేలుస్తాం

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:20 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి (2014, జూన్‌ 2) నుంచి నేటి వరకూ ఇచ్చిన మైనింగ్‌ లీజులు, ఇసుక తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో సీబీసీఐడి విచారణ జరిపిస్తామని...

సంగతి తేలుస్తాం

  • ఇసుక మాఫియాలో హరీశ్‌ రావు తమ్ముడు మహేశ్‌ రావు

  • ఏపీ మాజీ ఎమ్మెల్యేను బెదిరించి మైనింగ్‌ లీజు రాయించుకున్నారు

  • నేరెళ్ల ఇసుక మాఫియాలో సంతోష్‌ రావు తండ్రి రవీందర్‌ రావు

  • గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్స్‌లోనూ అక్రమ మైనింగ్‌

  • వద్దిరాజు రవిచంద్రను బెదిరించి గాయత్రీ గ్రానైట్స్‌ రాయించుకున్నారు

  • ఇప్పటిదాకా జరిగిన ఇసుక, మైనింగ్‌ లీజులపై సీబీసీఐడీ విచారణ

  • జరిమానాలు వేసి.. తర్వాత తగ్గించి పార్టీలోకి చేర్చుకున్న ఉదంతాలపైనా..

  • ఇవన్నీ వచ్చే సమావేశాల్లో బయటపెడ్తం

  • పదేళ్లపాటు మైనింగ్‌ లీజులతో వేల కోట్లు కొల్లగొట్టిన హరీశ్‌, కేటీఆర్‌

  • రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై కూడా సీబీసీఐడీ విచారణ జరుపుతాం

  • రాఘవకు, పొంగులేటికి సంబంధం లేదు.. ఉంటే నోటీసులిస్తామా!?

  • సీఎం రేవంత్‌ రెడ్డి ఘాటు విమర్శలు

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి (2014, జూన్‌ 2) నుంచి నేటి వరకూ ఇచ్చిన మైనింగ్‌ లీజులు, ఇసుక తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో సీబీసీఐడి విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. విచారణలో నిజాలను నిగ్గు తేల్చి.. వచ్చే శాసనసభ సమావేశాల్లో బయట పెడతామన్నారు. శాసనసభలో శనివారం ఆయన మాట్లాడారు. ‘‘మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తమ్ముడు మహేశ్‌ రావు ఇసుక మాఫియా నడిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మాజీ ఎమ్మెల్యేకు శిరీషా జీయో గ్రానెట్స్‌ కంపెనీ ఉండేది. అప్పట్లో మైనింగ్‌ శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు ఆ మాజీ ఎమ్మెల్యేను బెదిరించారు. ఆ కంపెనీ మైనింగ్‌ను బలవంతంగా లీజుకు రాయించుకున్నారు. అక్రమ మైనింగ్‌ చేశారు. దానిపై విచారణ చేయిస్తాను’’ అని సభలో ప్రకటించారు. రెవెన్యూ మంత్రిని బెదిరించేందుకు యత్నిస్తున్న హరీశ్‌రావు..


తన తమ్ముడైన మహేశ్‌ రావు పేరుమీద అక్రమంగా మైనింగ్‌ చేసుకున్నారని, దానిపై కూడా విచారణ జరిపిస్తామన్నారు. ‘‘సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్ల ఇసుక బాధితులైన దళితులను లారీ ఎక్కించి, తొక్కించి, చంపించి, ఇసుక అక్రమ రవాణా చేసిన జోగినిపల్లి సంతోష్ రావు తండ్రి రవీందర్‌రావుకు సంబంధించిన ఇసుక మాఫియాపై విచారణ జరిపించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్స్‌లో అక్రమ మైనింగ్‌ జరిగింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తోపాటు ఈడీ ఎంక్వైరీ జరిగింది. శ్వేత గ్రానైట్స్‌పై కూడా విచారణకు ఆదేశిస్తున్నాం. వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రీ గ్రానైట్‌ కంపెనీకి నోటీసులిచ్చి.. జరిమానా విధించి.. లొంగదీసుకుని, ఆయన గ్రానైట్‌ను బలవంతంగా రాయించుకున్నారు. దానిపై కూడా విచారణ జరిపిస్తాం’’ అని సీఎం ప్రకటించారు. అధికారంలో ఉన్నప్పుడు హరీశ్‌రావు, కేటీఆర్‌ ఇసుక దోపిడీకి పాల్పడ్డారని, ఆ మాఫియాకు నాయకత్వం వహించింది వారిద్దరేనని ఆరోపించారు. ‘‘మైనింగ్‌ శాఖ తొలుత హరీశ్‌ దగ్గర ఉండేది. ఆయన అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని కేసీఆర్‌ ఆ శాఖను తొలగించారు. కొడుకు, అల్లుడి మధ్య పంచాయితీ కారణంగా ఆ శాఖను కేటీఆర్‌కు అప్పగించారు. వారి అక్రమాలను బయటకు తీస్తాం’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఐదేళ్లపాటు హరీశ్‌, కేటీఆర్‌ ఆ శాఖను తీసుకుని, వేలాది కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ఇప్పుడు మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు అప్పట్లో ఇసుక మాఫియాలో భాగస్వాములని చెప్పారు. వారి పదేళ్ల దోపిడీ ప్రజలకు అర్థమవుతుందని బెంబేలెత్తుతున్నారని వ్యాఖ్యానించారు. ఇసుక, లీజు మాఫియా, జరిమానాలు వేసి.. ఆ తర్వాత తగ్గించి వారిని పార్టీలోకి తీసుకున్న ఉదంతాలపై విచారణ చేయిస్తామని, ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని సీఎం హెచ్చరించారు.


రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపైనా విచారణ

ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ గండిపడినా, ఎలాంటి తప్పిదాలు జరిగినా ఎవర్నీ ఉపేక్షించబోమని సీఎం రేవంత్‌ హెచ్చరించారు. అందరి నిగ్గు తేలుస్తానన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిచర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపైనా సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘రాఘవ కన్‌స్ట్రక్షన్‌ నుంచి సీనరేజీ చార్జీ కింద రూ.1,52,97,825.. పర్మిట్‌ ఫీజు కింద రూ.1,22,25,446 ప్రభుత్వం కట్టించుకుంది. ఇది ఏదో బీఆర్‌ఎస్‌ నేతలు కనిపెట్టి వారు ఫిర్యాదు చేస్తే తీసుకున్న చర్య కాదు. ప్రభుత్వమే స్వయంగా వివరాలు సేకరించింది. ఆ సంస్థకు నోటీసులిచ్చింది. దాని నుంచి సర్కారుకు రావాల్సిన బకాయిలను రాబట్టడమే కాకుండా, తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చాం’’ అని వివరించారు. ఇందులో విపక్షం ఫిర్యాదు లేదని, మరెవరో చెప్పలేదని, ఉద్దేశపూర్వకంగా ఒక మంత్రిపై బురదజల్లాలని, అక్కసు వెళ్లగక్కాలని, వారు అనుకున్న పైరవీలకు ఆ మంత్రి సహకరించడం లేదని ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చి బ్లాక్‌మెయిల్‌ చేయాలనుకున్నారని ఆరోపించారు. ఇటువంటివి ఇంకెక్కడైనా జరుగుతాయేమో కానీ, తమ ప్రభుత్వంలో సాగవని, అటువంటి బ్లాక్‌ మెయిల్‌కు ప్రభుత్వం భయపడబోదని స్పష్టం చేశారు.


రాఘవకు, మంత్రి పొంగులేటికి సంబంధం లేదు

రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి, మంత్రి పొంగులేటికి ఎటువంటి సంబంధం లేదని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. ‘‘ఇసుక మాఫియాలో మంత్రులకు ప్రమేయం ఉంటే ప్రభుత్వం నోటీసులిస్తుందా? నోటీసులిచ్చి పన్నులు వసూలు చేయడం జరుగుతుందా!? రాఘవ కన్‌స్ట్రక్షన్లో పొంగులేటికి ప్రత్యక్ష సంబంధం ఉంటే ఈరోజు నోటీసులిచ్చి, ఆదాయం రాబట్టుకునే ప్రయత్నం చేస్తామా?’’ అని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణల్లో ఏ రెడ్డి అయినా మరో రెడ్డికి దూరపు బంధువో, దగ్గర బంధువో అయి ఉంటారని వ్యాఖ్యానించారు. ‘‘సొంత అన్నదమ్ముల ఆస్తుల పంపకాల్లోనే తేడాలొస్తున్నాయి. కేటీఆర్‌, కవిత ఇద్దరూ కేసీఆర్‌ సంతానమే. పంపకాల్లో తేడాలు రావడంతో సొంత చెల్లినే ఇంట్లో నుంచి మెడలు పెట్టి బయటకు పంపారు. అన్నాచెల్లెళ్లకే ఆస్తి తగాదాలున్నప్పుడు.. పొంగులేటి కుటుంబ సభ్యులకో.. బంధువులకో గొడవలుంటే మంత్రికి ఏం సంబంధం’’ అని ప్రశ్నించారు. సొంత చెల్లినే ఇంట్లో నుంచి, పార్టీ నుంచి వెళ్లగొట్టి దోపిడీకి పాల్పడిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిదని మండిపడ్డారు. ‘‘బీఆర్‌ఎస్‌ ఎటువంటి బురదజల్లినా భయపడేది లేదు. మంత్రులను బ్లాక్‌ మెయిల్‌ చేసి భూములను రాయించుకుందామనే పప్పులుడకవు. ఇతర విషయాలను పొంగులేటికి ముడిపెట్టి, ఆయన్ను బెదిరించి, లొంగదీసుకోవాలనే ప్రయత్నం దిక్కుమాలిన చర్య. ఇలాంటి దిక్కుమాలిన ప్రయత్నాలు చేస్తే బీఆర్‌ఎస్‌కు ప్రయోజనం ఉండదు’’ అని స్పష్టం చేశారు.


35 శాతం ఆదాయం పెంచాం

రాష్ట్ర ఖజానాకు ఒక్క రూపాయి కూడా గండి పడకూడదని, ప్రతి పైసా ఖజానాకు చేరాలని మంత్రులు, అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని సీఎం రేవంత్‌ చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఆదాయం పెరిగిందని తెలిపారు. ‘‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో సర్కారుకు సీనరేజీ ద్వారా 721 కోట్ల ఆదాయం వచ్చింది. 2025-26లో అది 972 కోట్లకు చేరింది. అంటే, ఆదాయాన్ని 35 శాతం పెంచాం. ఇసుక మాఫియాను నడిపి, దోపిడీకి పాల్పడిందే బీఆర్‌ఎస్‌’’ అని ఘాటుగా విమర్శించారు.

Updated Date - Mar 29 , 2026 | 06:20 AM