పారే నీటిని ఎత్తిపోయగలిగితే.. బ్యారేజీలెందుకు?
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:05 AM
ప్రాణహితలో నీరు పారుతున్నా ఎత్తిపోయడం లేదంటూ రాద్ధాంతం చేస్తున్నారని.. పారే నీటిని ఎత్తిపోయగలిగితే బ్యారేజీలు ఎందుకు కట్టారని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల గేట్లు మూసి, నీటిని నిల్వ చేస్తేనే ఎత్తిపోతలు సాధ్యం
అలా నిల్వ చేస్తే బ్యారేజీలు తెగిపోయే ముప్పు ఉందని ఎన్‌డీఎ్‌సఏ తేల్చింది
అయినా నీటిని ఎత్తిపోయట్లేదంటూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల కిలాడీ కమిటీ రాద్ధాంతం
బ్యారేజీలు కొట్టుకుపోయేలా చేయాలనే కుయత్నం.. ఆ గజదొంగల గుంపులో ఈటల చేరారు
బ్యారేజీల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాకే ఎత్తిపోతలు చేపడతాం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ప్రాణహితలో నీరు పారుతున్నా ఎత్తిపోయడం లేదంటూ రాద్ధాంతం చేస్తున్నారని.. పారే నీటిని ఎత్తిపోయగలిగితే బ్యారేజీలు ఎందుకు కట్టారని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు మూసి, నీళ్లు నిల్వ చేస్తే తప్ప నీటిని ఎత్తిపోయలేమని.. అలా నీళ్లు నిల్వ చేస్తే బ్యారేజీలు తెగిపోయే ముప్పు ఉందని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల కిలాడీ కమిటీ ప్రజలను వంచించి.. బ్యారేజీలు కొట్టుకుపోయేలా చేయాలనే కుయత్నం చేస్తోందని ఆక్షేపించారు. ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఆ గజదొంగల గుంపులో చేరారని మండిపడ్డారు. బ్యారేజీల పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టామని, ఆ పనులు పూర్తయ్యాకే ఎత్తిపోతలు చేపడతామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని క్యాంపు కార్యాలయం (బోధి)లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రాణహితలో నీళ్లు పారినంత మాత్రాన ఎత్తిపోయలేం. పంపుల హెడ్ తగిలే దాకా నీటిని నిల్వ చే యాలి. అంటే మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు మూసి, నీళ్లు నిల్వ చేస్తే తప్ప నీటిని ఎత్తిపోయలేం. ఉదాహరణకు మేడిగడ్డ బ్యారేజీ 89 మీటర్ల ఎత్తులో ఉంది. అక్కడి నుంచి నీటిని అన్నారం బ్యారేజీకి ఎత్తిపోసేందుకు కన్నెపల్లి వద్ద పంపుహౌస్ నిర్మించారు. ఈ పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలంటే.. మేడిగడ్డలో 93.5 మీటర్ల మేర నీటి నిల్వ ఉండాలి.
అంటే కనీసం ఐదారు టీఎంసీల నీటిని నిల్వ చేస్తేనే ఎత్తిపోయడం సాధ్యం. పైన ఉన్న అన్నారం, సుందిళ్ల దగ్గరా ఇదే పరిస్థితి. వరుసగా ఒకదాని నుంచి మరో దానికి నీటిని ఎత్తిపోస్తే తప్ప ఎల్లంపల్లికి చేరవు. కానీ మూడు బ్యారేజీలు కూడా నీటి నిల్వకు పనికిరావని, నిల్వ చేస్తే ముప్పు తప్పదని ఎన్డీఎస్ఏ పదిసార్లు చెప్పింది. అంతేకాదు బ్యారేజీల గేట్లు మూ యకుండా పంప్‌చేస్తే.. ఆ నీరు ఎల్లంపల్లికి వెళ్లదు. తిరిగి వెనక్కే వస్తుంది’’ అని రేవంత్ స్పష్టం చేశారు. కానీ కన్నెపల్లి పంపులు నడపాలని.. అన్నారం, సుం దిళ్ల నింపాలని బీఆర్‌ఎస్ నేతలు కనీస బుద్ధీజ్ఞానం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
కిలాడీ కమిటీలోకి ఈటల రాజేందర్..
తమ ముందు ఇప్పుడు రెండు కమిటీల నివేదికలు ఉన్నాయని.. ఒకటి ఎన్డీఎస్ఏ కమిటీ అయితే, మరొకటి కిలాడీ కమిటీదని రేవంత్ ఎద్దేవా చేశారు. కిలాడీ కమిటీకి చైర్మన్ కేసీఆర్, సభ్యులు కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ అని విమర్శించారు. తాము ఏ కమిటీ చెప్పింది వినాలని ప్రశ్నించారు. ‘‘ఈటల రాజేందర్ పాత సోపతి వైపు మాట్లాడారు. రాజేందర్ అంటే గౌరవమే. కానీ ఆయన మాటలను గౌరవించే పరిస్థితి లేదు. ఆయనకు కొన్ని విజ్ఞప్తులు చేస్తున్నాను. ఒకటి కేంద్ర జలశక్తి శాఖ దగ్గరకు వెళ్లి, ఎన్డీఎస్ఏ చైర్మన్‌ను పిలిపించి కన్నెపల్లి వద్ద నీళ్లు ఎత్తిపోయాలని చెప్పాలి. ఎన్డీఎస్ఏ ఆ పనికి ఒప్పుకొంటే మేం పూర్తిగా సహకరిస్తాం. మూడు బ్యారేజీ ల కాంట్రాక్ట్ హరీశ్‌రావుకే ఇస్తాం. బినామీ కాంట్రాక్టర్లను పెట్టుకున్న హరీశ్‌రావు ఈసారి నేరుగా కాంట్రాక్టర్ కావొచ్చు. ఇక కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2025 సెప్టెంబరు 1న జీవో ఇచ్చింది. కానీ చీకటి ఒప్పందం ఆ వి చారణను అడ్డుకుంటోంది? ఇప్పటికైనా సీబీఐ విచారణ చేసేలా ఈటల ప్రయత్నం చేయాలి. ఈటలకు మరో సూచన ఏంటంటే.. కేటీఆర్, హరీశ్‌రావు గజదొంగలు. ఆ దొంగల బ్యాచ్‌లో చేరొద్దు’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక కాళేశ్వరం అవినీతిలో భాగస్వాములైన తెలంగాణరిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కూడా తప్పుడు ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు.
సమగ్ర పునరుద్ధరణ చేశాకే..
మూడు బ్యారేజీలను సమగ్రంగా పునరుద్ధరించాకే నీటి నిల్వ చేయాలని ఎన్డీఎస్‌ఏ తేల్చిచెప్పిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. అన్నిరకాల పరీక్షలు చేసి, పునరుద్ధరణ కోసం పక్కా డిజైన్లు రూపొందించి, వాటిని ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం)తో మదింపు చేశాక పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్పష్టం చేసిందని వివరించారు. ‘‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రత్యేక సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుచేసింది. మూడు బ్యారేజీల వద్ద నిర్మాణ లోపాలు ఉన్నాయని కూడా స్పష్టం చేసింది. మూడు బ్యారేజీల డిజైన్, పునరుద్ధరణ ప్రతిపాదనలకు సాంకేతిక సలహాలు ఇవ్వడంతో పాటు నిర్మాణ పనులు, నాణ్యత నియంత్రణ, ఇతర మార్పులు ఏమైనా చేస్తే ఈ కమిటీకి తప్పనిసరిగా తెలియచేయాలని చెప్పింది. సీడబ్ల్యూసీ, ఎన్డీఎ్‌సఏ కమిటీల నివేదికలకు అనుగుణంగా బ్యారేజీల పునరుద్ధరణ చేపడతాం’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల పథకంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం పూర్తయితే.. సుందిళ్ల బ్యారేజీని మరమ్మతులు చేసి, ఉపయోగిస్తామన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు తరలించి, అక్కడి నుంచి ఎల్లంపల్లికి తరలించాలా? నేరుగా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి తరలించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
అన్నం తినేవాడు మాట్లాడే మాటలేనా?
‘గురు దక్షిణ కోసం నీటిని వదిలిండు. పట్టిసీమ కోసం నీటిని వదులుతున్నారు’ అంటూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ తీవ్రంగా మండిపడ్డారు. 2015లోనే పట్టిసీమ చేపట్టి నిర్మించారని, ఆ సమయంలో ఆపకుండా హరీశ్‌రావు, ఆయన మామ గాడిదలు కాశారా అని నిలదీశారు. తెలంగాణ వాదుల ముసుగులో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ‘‘బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు.. కేసీఆర్ లక్కీ నంబర్ 6 ప్రకారం సిక్స్ పర్సెంట్, హరీశ్‌రావు లక్కీ నంబర్ 3 ప్రకారం మూడు పర్సంట్, బావకు మూడు ఇస్తే.. నాకు 1 పర్సంట్ అని కేటీఆర్ వసూలు చేశారు. మొత్తంగా 10ు కమీషన్లు వసూలు చేశారు. ఇప్పుడు హరీశ్ కూడా పాత కమీషన్లు రాబట్టుకోవడానికే తనకు నీటిపారుదలశాఖ ఇవ్వాలంటున్నారు’’ అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ఉ ద్యమ సమయంలో నారాయణ, చైతన్య సంస్థలు తెలంగాణ ప్రజల రక్తం పీలుస్తున్నాయని హరీశ్ అన్నారని.. ఇప్పుడదే ఆంధ్రా విద్యాసంస్థలను బ్లాక్ మెయిల్ చేసి పాలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
బ్యారేజీలను పునరుద్ధరించి, వినియోగంలోకి తెస్తాం: ఉత్తమ్
బ్యారేజీలపై బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ఎన్డీఎ్‌సఏ నివేదిక ప్రకారం అన్నారం, సుందిళ్ల పునాదులు కూడా సరిగ్గా లేవని చెప్పారు. ఆ బ్యారేజీలను మళ్లీ వినియోగించాలనేదే తమ ప్రయత్నమని.. అందుకోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ఏజెన్సీలను నియమించామని వివరించారు. జూలైలో పరీక్షలు పూర్తవుతాయని.. తర్వాత డిజైన్లు సిద్ధం చేసి పునరుద్ధరణ చేపడతామని తెలిపారు.