ఈసారి 117 సీట్లు..
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:52 AM
తెలంగాణ శాసనసభ ఎన్నికలు అందరూ అనుకుంటున్నట్లు 2028లో కాకుండా 2029 మే, జూన్ నెలల్లో జరగబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
అసెంబ్లీ సీట్లు 182కు, లోక్‌సభ 26కు పెరుగుతాయి
2029 మే, జూన్ నెలల్లో ఎన్నికలు
రాష్ట్రంలో 20 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటాం
కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళంలోకి తొక్కుతాం
బీజేపీతో హరీశ్ చీకటి బేరాలు సాగుతున్నాయ్
కాదంటే రాముడి మీద, మామ మీద ఒట్టెయ్
రైతుల కోసం నెలకు 5,525 కోట్లు ఖర్చు పెడుతున్నాం
5 లక్షల మందితో ఖమ్మంలో రాహుల్ సభ
రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు
ఖమ్మం, జూలై 10(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ శాసనసభ ఎన్నికలు అందరూ అనుకుంటున్నట్లు 2028లో కాకుండా 2029 మే, జూన్ నెలల్లో జరగబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెసే మరోసారి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్.... ఇదే వచ్చే ఎన్నికల్లో పార్టీ నినాదమని, కార్యకర్తలంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పునర్విభజన తర్వాత లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కు, అసెంబ్లీ సీట్లు 119 నుంచి 182కు పెరుగుతాయని చెప్పారు. కాంగ్రెస్ 117 సీట్లలో గెలిచి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అన్నారు. లోకసభలోనూ 20 సీట్లు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దీన్ని సాధించడం కోసం రోజుకు 18 గంటలు మంత్రులంతా పని చేస్తామని, కార్యకర్తలు కూడా ఇదే లక్ష్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. కల్వకుంట్ల కౌరవ వంశాన్ని తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి తప్పించి, పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించొద్దని కోరారు. 2023లో ఖమ్మంలో రాహుల్ సభ తర్వాత గాంధీభవన్‌లో తనను కలిసిన జర్నలిస్టులకు కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని చెప్పానన్నారు.
ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ అధికారంలోకి ఏం వస్తుందని వారు ప్రశ్నించగా, తను కాంగ్రెస్ సాధించే సీట్లు చిట్టీపై రాసి, సీల్డ్ కవర్లో పెట్టుకోండి, డిసెంబర్‌లో తెరవండని చెప్పానని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ 65, సీపీఐ 1, బీజేపీ 8-9, ఎంఐఎం 6-7 గెలుస్తాయనీ మిగిలినవి మాత్రమే కేసీఆర్ భజనపరులు గెలుస్తారని నాడు చెప్పానని, డిసెంబరు 2023 ఫలితాలు అదే విధంగా వచ్చాయని చెప్పారు. మోదీ కుయుక్తులతో డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకొనే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని, అనంతర పరిణామాలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు గుండు సున్నా వస్తుందని చేవెళ్ల వేదికగా చెప్పానని, అదే జరిగిందని గుర్తు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో 2/3 పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లో 85-90 శాతం గెలుస్తామని చెప్పి, నిలబెట్టుకున్నామని ప్రస్తావించారు. వరుస విజయాలతో పాపాల బైరవుడిని ఫాంహౌస్‌లో బంధించామని, పశుపతికి విముక్తి లేదని వ్యాఖ్యానించారు. నాడు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని కేసీఆర్ అంటే నేడు ఉత్తమ్, భట్టి, తుమ్మల కలిసి వరి వేసుకుంటే రూ.500 బోనస్ ఇచ్చారని, చివరి గింజ వరకు కొన్నారని చెప్పారు. ఆరు నూరైనా రైతు భరోసా నిధులివ్వాలని తుమ్మల పట్టుబట్టి భట్టితో నిధులు వేయించుకున్నారని అన్నారు. పోయిన సంవత్సరం లాగానే ఈ జూన్‌లో కూడా 9 వేల కోట్లు 9 రోజుల్లో రైతు భరోసా కింద వేశామన్నారు. రైతు బీమా, రుణమాఫీ, గిట్టుబాటు ధర, ఉచిత కరెంటు, పంట నష్టం పరిహారం సహా రైతులకు 30 నెలల్లో 1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తమదేనని చెప్పారు. గత ప్రభుత్వం రైతుల కోసం నెలకు రూ.2500 కోట్లు ఖర్చు పెడితే తమ ప్రభుత్వం నెలకు 5,525 కోట్లు చొప్పున ఖర్చు పెట్టిందన్నారు. 25 లక్షల మంది రైతులకు 25 వేల కోట్ల వరకు రుణం మాఫీ చేశామని వివరించారు. ఉచిత కరెంటు కోసం రూ.30 వేల కోట్లను చెల్లించామని చెప్పారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారని, కల్వకుంట్ల కుటుంబం వైరును పట్టుకుంటే కాకిలా మాడిపోతారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఇంట్లోనే పోటీ ఉందని, బావబామ్మర్దులకు ఒకరిమీద ఒకరికి నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. చెరో గుంపు మెయింటెయిన్ చేస్తున్నారన్నారు. ఒక గుంపు నాయకుడు మేడిగడ్డలో నీళ్లు నింపండని, కన్నెపల్లి ఎత్తండి అంటూ మొన్న కన్నెపల్లి పోయాడని ప్రస్తావించారు. మేడిగడ్డలో గేట్లు దించి నీళ్లు నిలబెడితే రేపు మేడిగడ్డ తెగిపోతే భద్రాచలం రాముడే ఉండడన్నారు. ఖమ్మం జిల్లాలో 44 ఊర్లు కొట్టుకుపోతాయని చెప్పారు. లుచ్చా రాజకీయాల కోసం భద్రాచలం కొట్టుకుపోయేలా చేయాలా? అని ప్రశ్నించారు. అధికార కాంక్ష మీద సీఎం ఒక పిట్ట కథ చెప్పారు. ‘‘అధికారం కోసం బావమరిది మర్రిచెట్టు మీద తపస్సు చేస్తుంటే అదే చెట్టు కింద బావ తపస్సు చేస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమై మొదట చెట్టు కింద ఉన్న బావను ఏం కావాలో కోరుకోమంటే బావమరిదికి ఇచ్చే దానికి రెట్టింపు అడిగాడట. తర్వాత దేవుడు మర్రిచెట్టు మీదకు వెళ్లి బావమరిదిని ఏం కావాలో కోరుకో అని అడిగితే బావ ఏం కోరుకున్నాడో చెప్పమన్నాడట. బావమరిదికి ఇచ్చిన దానికి రెండు రెట్లు అడిగాడని చెప్పాడట. దాంతో బావమరిది తనకు ఒక కన్ను పొడవమని అడగడంతో దేవుడు తఽథాస్తు అన్నాడట. బావమరిదికి ఒక కన్ను లేదు. బావకు రెండు కళ్లు లేవు. రెండు కళ్లు లేని బావను భుజం మీద ఎక్కించుకొని బావమరిది ఇక్కడే ఎక్కడో చింతకాని సభ దగ్గర పల్లీబఠానీలు అమ్ముకుంటూ ఉండొచ్చు’’ అని ముఖ్యమంత్రి అపహాస్యం చేశారు. తెలివిలేని బావ, పబ్బులు, గబ్బు పనుల్లో తిరిగే బావమరిది... వీళ్లు వచ్చి కాంగ్రెస్‌ను ఓడిస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియకుండా, ఎవరు పోటీ చేస్తారో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటదో తెలవకుండా సర్వే చేసి ఎవరు గెలుస్తారో నిర్ణయిస్తారంట అని దుయ్యబట్టారు.
రాముడి మీద హరీశ్ ఒట్టేయాలి
హరీశ్‌రావు ఇప్పటికీ బీజేపీ వాళ్లతో చీకటి మంతనాలు చేస్తున్నారని, అబద్ధమైతే భద్రాచలం రాముడి మీద, మామ కేసీఆర్ మీద ఒట్టేసి చెప్పాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. కేసులకు భయపడి పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రణాళిక ఉందని స్వయంగా కవితే చెప్పారని గుర్తు చేశారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి 1400 కోట్లు కొల్లగొట్టారని కేటీఆర్ చెల్లెలే చెబుతోందని ప్రస్తావించారు. కేసీఆర్ రెండోసారి గెలిచినప్పుడు హరీశ్‌ను మంత్రిని చేయడానికి ఏడాది పట్టిందని, మెడలు పట్టి పార్టీలోంచి వెళ్లగొట్టే ప్రయత్నం జరిగిందని అన్నారు. హరీశ్ కన్నెపల్లికి వెళ్లినపుడు కేటీఆర్‌ను వెంట తీసుకెళ్లలేదని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతీ పథకం మరింత మెరుగ్గా అమలు చేస్తున్నామని చెప్పారు. రాజకీయంగా తనకు పాలమూరు ప్రాణమైతే తన రాజకీయ ఎదుగుదలలో ఖమ్మం జిల్లా గుండెలా పని చేసిందని రేవంత్ అన్నారు. రాహుల్‌ను ప్రధానమంత్రిని చేయడం లక్ష్యంగా ప్రస్తుత ఆశీర్వాద సభ స్థలంలోనే 5 లక్షల మందితో రాహుల్‌గాంధీ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
భరోసా చివరి వాయిదా విడుదల
సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి చేతుల మీదుగా రైతు భరోసా నిధులు, మొక్కజొన్న రైతులకు చెల్లింపులు, భూధార్ కార్డులు అందించారు. రైతు భరోసా కింద 9 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు మిగిలిన రైతులకు రూ.1,009 కోట్లు జమ చేసి 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా చెల్లింపునకు ముగింపు ఇచ్చారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించి రూ.3,546 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులకు చెక్కులు అందించారు. ఎర్రుపాలెం మండలం మొలుగుమాడు గ్రామంలో సాగులో ఉండి రికార్డులు లేని రైతులకు సర్వే నిర్వహించిన అనంతరం భూధార్ కార్డులు, ఈ- పాస్ పుస్తకాలు ముఖ్యమంత్రి చేతులమీదుగా అందజేశారు.