Share News

ప్రత్యేక తెలంగాణలో క్రీడా స్ఫూర్తి కనుమరుగు

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:53 AM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తి కనుమరుగైందని, క్రీడలంటే ఎలా ఉంటాయని వెతుక్కునే పరిస్థితి దాపురించిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక తెలంగాణలో క్రీడా స్ఫూర్తి కనుమరుగు

  • అందుకే స్పోర్ట్స్‌ పాలసీ, క్రీడలకు ప్రాధాన్యం.. మెస్సీని కాకుండా డ్రగ్స్‌ కింగ్‌ను పిలవాలా!?

  • క్రీడలను బహిష్కరించడం క్రీడా స్ఫూర్తా!?

  • వాళ్లకు ఫాంహౌస్‌, పబ్‌ విందులే కావాలి

  • యువత వాటికి దూరంగా ఉండాలనే క్రీడలకు ప్రోత్సాహం: సీఎం రేవంత్‌రెడ్డి

  • ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేల స్పోర్ట్స్‌ మీట్‌

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తి కనుమరుగైందని, క్రీడలంటే ఎలా ఉంటాయని వెతుక్కునే పరిస్థితి దాపురించిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పోర్ట్స్‌ పాలసీని తీసుకొచ్చామని, ప్రపంచ స్థాయిలో పరిణామాలు, వివిధ క్రీడలు, క్రీడాకారులు, శిక్షణకు ప్రత్యేక సలహాదారుడ్ని ఏర్పాటు చేశామని తెలిపారు. స్పోర్ట్స్‌ పాలసీతో మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని సీఎం కప్‌ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర శాసన మండలి, శాసన సభ సభ్యులకు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో శనివారం స్పోర్ట్స్‌ మీట్‌-2026ని సీఎం రేవంత్‌ రెడ్డి క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మంత్రి జూపల్లి ఆ జ్యోతితో మైదానంలో రన్‌లో పాల్గొని మిగతా సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. కొందరు ప్రతిపక్ష నాయకులు క్రీడలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారని, అదేం క్రీడా స్ఫూర్తో తనకు అర్థం కావడం లేదని విమర్శించారు. రాజకీయాలకతీతంగా మైదానంలో క్రీడా స్ఫూర్తి ప్రదర్శిస్తే.. భవిష్యత్తు తరాలు కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతిపక్షాల ఆలోచనలు ఎంతసేపు ఫాంహౌ్‌సల్లో పార్టీలు, పబ్‌ల్లో విందుల గురించే. ఫాంహౌస్‌ పార్టీలు, పబ్‌ల్లో విందులకు, డ్రగ్స్‌, గంజాయి, మత్తుకు యువతను దూరంగా ఉంచేందుకు ‘మత్తు బాట వీడండి.. మైదానాల బాటపట్టండి’ అని పిలుపునిచ్చాం. ఈ స్ఫూర్తి కొనసాగుతుంది’’ అని ప్రకటించారు.


మెస్సీని కాకుండా డ్రగ్స్‌ కింగ్‌ను పిలవాలా!?

ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీని నగరానికి తేవడంతో రాష్ట్ర ఖ్యాతి ప్రపంచానికి తెలిసిందని, కానీ, ప్రతిపక్షాల తీరు చూస్తుంటే మెస్సీని కాకుండా డ్రగ్స్‌ కింగ్‌ను పిలవాలన్నట్లు ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ‘‘క్రీడా స్ఫూర్తిని నింపేందుకు మెస్సీని తెచ్చాం. కొందరు ప్రతిపక్ష నాయకులు వివాదం సృష్టించే ప్రయత్నం చేసారు. అతన్నెందుకు పిలిచారని చర్చ లేవనెత్తారు. మెస్సీని కాకుండా మెక్సికోలో ఎన్‌కౌంటర్‌ అయిన డ్రగ్స్‌ కింగ్‌ లార్డ్స్‌ చాకోను పిలిస్తే ఆనందపడతారా!?’’ అని ఎద్దేవా చేశారు. ప్రజా జీవితంలో ఉండే వారికి స్ఫూర్తి, విశ్రాంతినిచ్చేందుకే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు రాష్ట్రం క్రీడల రాజధానిగా రాణించిందని, ఆ తర్వాత వివిధ కారణాలతో పోటీల నిర్వహణ తగ్గుతూ పోయిందన్నారు.


2034లో గచ్చిబౌలిలో ఒలింపిక్స్‌

‘‘గచ్చిబౌలిలో ఉన్న 70 ఎకరాల క్రీడా మైదానాల్ని రూ.700 కోట్లతో ప్రపంచ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేలా అభివృద్ధి చేస్తాం. 2034లో ఒలింపిక్స్‌ అక్కడ నిర్వహించేలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. మూడు నెలల్లో పనులు ప్రారంభించి మూడు సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తాం’’ అని ప్రకటించారు. రాజకీయ కార్యక్రమాలకే పరిమితమైన ఎల్బీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని, అద్భుత క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ‘‘బేగంపేట్‌లో ఉన్న అంతర్జాతీయ హాకీ గ్రౌండ్‌ను అభివృద్ధి చేస్తాం. 1950-60 మధ్య ఒలింపిక్స్‌లో మొదటిసారి భారతదేశానికి ఫుట్‌బాల్‌లో నాలుగోస్థానం వచ్చింది. నాడు ఏడుగురు క్రీడాకారులు హైదరాబాద్‌ నుంచే పోటీల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఎంట్రీ లెవల్‌కు కూడా వెళ్లలేదు. ఒకప్పుడు ఫుట్‌బాల్‌, హాకీ, క్రికెట్‌కు మన రాష్ట్రం, నగరం దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. ఇప్పుడు వెనకబడ్డాం. అందుకే, క్రీడాస్ఫూర్తితో ప్రభుత్వం చర్యలు చేపట్టింది’’అని వివరించారు. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని, క్రీడల్లో రాణించేవారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించే బాధ్యత తమదని చెప్పారు. తెలంగాణలో మొదటిసారి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు క్రీడలు నిర్వహించడం అభినందనీయమని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కొనియాడారు. క్రీడలకు కులం, మతం, రాజకీయాలు ఉండవని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. కాగా, ఆదివారం రెండో రోజు శాసన సభ్యుల క్రీడా పోటీలు కొనసాగుతాయి.


ఫుట్‌బాల్‌లో సీఎం.. కబడ్డీలో సత్తా చాటిన వాకిటి

క్రీడా పోటీల్లో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొని ఆయా క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఐదు గోల్స్‌తో సీఎం జట్టు విజయం సాధించగా.. అత్యధికంగా నాలుగు గోల్స్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి కొట్టారు. కబడ్డీలో క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి ఒక్కరే 15 పాయింట్లు సాధించి సత్తా చాటారు. మహిళా సభ్యులకు ప్రత్యేకంగా నిర్వహించిన లెమన్‌అండ్‌స్పూన్‌ గేమ్‌లో మంత్రి కొండా సురేఖ విజయం సాధించారు. ఫుట్‌ బాల్‌, కబడ్డీ పోటీల్లో పలువురు సభ్యులు కిందపడ్డా.. తిరిగి లేచి నిలబడి ఎంతో చురుగ్గా పోటీల్లో పాల్గొన్నారు. తాము, జట్టు పాయింట్లు సాధించిన సమయంలో ఆనందంగా గంతులేశారు.

Updated Date - Mar 29 , 2026 | 06:55 AM