సర్వేలన్నీ సానుకూలమే
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:18 AM
మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన సర్వేలు కాంగ్రెస్‌కే సానుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
80 శాతం సీట్లలో కచ్చితంగా గెలుస్తాం.. మిగిలిన 20ు సీట్లపై దృష్టి పెట్టండి
మునిసిపోల్స్‌లో రెబల్స్ ఉండకూడదు
7 కార్పొరేషన్లను హస్తగతం చేసుకోవాలి
టీపీసీసీ పీఏసీ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన సర్వేలు కాంగ్రెస్‌కే సానుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ సర్వేల ప్రకారం 80 శాతం సీట్లలో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధించనుందని స్పష్టం చేశారు. మిగిలిన 20 శాతం సీట్లలో గట్టి పోటీ ఉందని, కష్టపడితే వాటిలోనూ సానుకూల ఫలితం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని పని చేయాలని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న మంత్రులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాదిరిగానే మునిసిపల్ ఎన్నికలనూ సవాల్‌గా తీసుకుని గెలిపించుకుందామన్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న 7 కార్పొరేషన్లూ కాంగ్రెస్ ఖాతాలో చేరాల్సిందేనన్నారు. కొన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సమస్యలున్నాయని, వాటిపై ఇన్‌చార్జి మంత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడతానని చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారంతో గడువు ముగియనుండగా.. ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలపాల్సిన నేపథ్యంలో సోమవారం టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు, ఎన్నికల కమిటీలు జూమ్ ద్వారా భేటీ అయ్యాయి. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు, టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు, ఎన్నికల కమిటీల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు లేకుండా చూడాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల రెబల్ అభ్యర్థుల కారణంగా ప్రత్యర్థి పార్టీలు గెలిచాయని గుర్తు చేశారు. అసంతృప్త నేతలతో భేటీ అయి నచ్చజెప్పాలని, నామినేటెడ్ పోస్టులపై హామీలు ఇవ్వాలన్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలన్నారు. అన్ని సమస్యలనూ పరిష్కరించుకుని ఐక్యంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీని తేలికగా తీసుకోవద్దని, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల పరిఽధిలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలపై గట్టిగా దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలిసింది. కొన్ని చోట్ల బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకత్వాలు సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాయన్న అంశమూ చర్చకు వచ్చినట్లు సమాచారం. కాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం అంకితభావంతో పని చేసిన వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అభ్యర్థుల ఎంపికలో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలన్నారు.
అభ్యర్థుల జాబితాకు ఆమోదం
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏర్పాటైన స్ర్కీనింగ్ కమిటీలు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలను టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమోదించారు. అభ్యర్థులకు బీ ఫారాలు జారీ చేయడానికి డీసీసీ అధ్యక్షులకు ఆథరైజేషన్ ఇస్తూ తీర్మానించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచే బీఫారాల పంపిణీ ప్రారంభమైంది. సమస్యలు ఉన్న చోట్ల పరిష్కారం చూపిన తర్వాత బీ ఫారాలను జారీ చేయనున్నారు.
సీఎంకు పీఏసీ సభ్యుల అభినందనలు
హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందిన సీఎం రేవంత్‌రెడ్డిని పీఏసీ సమావేశంలో మంత్రులు, సభ్యులు అభినందించారు. సీఎం హోదాలో ఉండి హార్వర్డ్ వర్సిటీకి వెళ్లి కోర్సును దిగ్విజయంగా పూర్తి చేసి.. పట్టా పొందడం ద్వారా విద్య విషయంలో రాష్ట్రంలోని యువతకు ఒక సందేశాన్ని ఇచ్చారని కొనియాడారు.
నేడు ఇన్‌చార్జి మంత్రులతో భేటీ
పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జిల(మంత్రుల)తో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సైతం పాల్గొననున్నారు. మీటింగ్ సమయానికి ఏయే కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు.. ప్రత్యర్థి పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి.. అనే అంశాలపై సమగ్ర సమాచారంతో రావాలని ఇన్‌చార్జి మంత్రులకు టీపీసీసీ చీఫ్ సూచించారు. తిరుగుబాటు అభ్యర్థులపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీఎం రేవంత్ ప్రచార షెడ్యూల్‌పై చర్చించనున్నారు.