Share News

పనిని నిర్లక్ష్యం చేస్తే వేటే..!

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:50 AM

కొడంగల్‌ నియోజకవర్గంలో తాను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎడ్యుకేషనల్‌ హబ్‌లోని వివిధ విద్యాసంస్థల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పనిని నిర్లక్ష్యం చేస్తే వేటే..!

  • మార్చికల్లా ఎడ్యుకేషన్‌ హబ్‌ పూర్తి కావాలి

  • కాంట్రాక్టర్లు నెలవారీ లక్ష్యంతో పనిచేయాలి

  • తెలిసిన వారైనా అలసత్వాన్ని ఉపేక్షించను

  • అనుకున్నట్లు చేయకుంటే సిబ్బంది సస్పెన్షనే

  • హబ్‌ అద్భుతమని చెప్పాం.. ఇక్కడేం లేదు

  • కొడంగల్‌ హబ్‌ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి

  • శనివారం లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

వికారాబాద్‌/ కొడంగల్‌/ దుద్యాల్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కొడంగల్‌ నియోజకవర్గంలో తాను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎడ్యుకేషనల్‌ హబ్‌లోని వివిధ విద్యాసంస్థల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ముందు అనుకున్న డెడ్‌లైన్‌ ప్రకారం 2027 మార్చి కల్లా హబ్‌లోని విద్యాసంస్థల నిర్మాణం పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా నెలవారీ లక్ష్యాలు నిర్ణయించుకొని పని చేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా పని చేయని వారెవరినైనా వెంటనే సస్పెండ్‌ చేయాలని ఉన్నతాధికారులకు చెప్పారు. మంగళవారం ఆయన హకీంపేట ఎడ్యుకేషనల్‌ హబ్‌లో వివిధ విద్యా సంస్థల నిర్మాణ పనులను పరిశీలించారు. యంగ్‌ ఇండియా, ఇంజనీరింగ్‌, వెటర్నరీ, మెడికల్‌, నర్సింగ్‌, పారామెడికల్‌, ఫిజియోథెరపీ కళాశాలల భవన నిర్మాణ పనులను దగ్గరకు వెళ్లి పరిశీలించారు. పనులు నత్తనడకన సాగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటి వరకు ఒక లెక్క... ఇక మీదట మరో లెక్క. అనుకున్న పని జరగకపోతే ఊరుకోను’’ అన్నారు. కాగితాలపై నివేదికలు చూపిస్తే సరిపోదని, క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు తనకు తెలిసిన వారైనా పని చేయకపోతే ఫలితం అనుభవించక తప్పదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇరవై ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని, దొంగలెవరో, దొరలెవరో ఇట్టే కనిపెట్టేస్తానని చెప్పారు. సకాలంలో పని జరగకపోతే తనకు తెలిసిన వారు తెలవని వారి కిందే లెక్క అని వ్యాఖ్యానించారు.


ఎడ్యుకేషనల్‌ హబ్‌ను ఓ పెద్ద అద్భుతంగా చెప్పుకున్నామని, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి ఏమీ కనబడటం లేదని మండిపడ్డారు. హబ్‌లో జరిగే పనులను పర్యవేక్షించి, ఫలితాలు ఇవ్వాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లు, అధికారులదని, ఏ నెలలో ఎంత పని చేస్తారో షెడ్యూల్‌ వేసుకొని పనులు చేపట్టాలని, ఎంత డబ్బు అవసరమో తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రతీ నెలా పురోగతిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఖర్చుకు సంబంధించిన పుస్తకంలో నమోదు చేయకుండా పనులు జోరుగా జరుగుతున్నాయని చెబితే నమ్యేంత అమాయకుడిని కాదని, ఎన్ని టోకెట్లు వచ్చాయో చూస్తే పనుల పురోగతి ఇట్టే అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. హబ్‌లోని ఒక్కో ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ కార్యాచరణను సిద్ధం చేయాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ప్రతి ప్రాజెక్టుపై కాంట్రాక్టర్లు, ఇంజనీర్లతో సమావేశాలు నిర్వహించాలని, డ్రాయింగ్స్‌ లేదా ఇతర అనుమతుల వల్ల జాప్యం ఉంటే వెంటనే పరిష్కరించాలని చెప్పారు. హబ్‌లో జరుగుతున్న అన్ని పనులపై పూర్తి స్థాయి నివేదికను శనివారంలోగా తనకు అందజేయాలని స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యంపైనా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోగా లబ్దిదారులకు లాటరీ తీసి ప్లాట్ల పట్టాలు అందజేయాలని చెప్పారు.

Updated Date - Jul 22 , 2026 | 05:52 AM