ఔటర్ నిర్వహణ బాలేదు
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:28 AM
రాష్ట్ర ప్రగతికి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ ఏ మాత్రం బాగోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా ఉన్నారని సీఎం మండిపడ్డారు.
కాంట్రాక్టర్ కంపెనీపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం
అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి
ఒకే గొడుగు కిందకు ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్, రేడియల్ రోడ్లు
భూసేకరణ, రుణాలు, నిర్వహణ దానికిందే..
ప్రభుత్వం సేకరించిన భూములకే టీడీఆర్
టీడీఆర్ బాండ్లపై ప్రత్యేక కమిటీ వేయాలి
ఫ్యూచర్‌సిటీ రోడ్డు డిసెంబరు 9కి పూర్తవ్వాలి
రోడ్ల నిర్మాణంపై సమీక్షలో సీఎం ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రగతికి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ ఏ మాత్రం బాగోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా ఉన్నారని సీఎం మండిపడ్డారు. ఓఆర్‌ఆర్ నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రి ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య రోడ్ల అభివృద్ధి గురించి హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌డీసీఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జయేశ్ రంజన్, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, ఈ రెండింటికీ అనుసంధానంగా కొత్తగా నిర్మించే రేడియల్ రోడ్లు... వీటన్నింటినీ ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణను కూడా ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని చెప్పారు. అప్పుడే సమన్వయం తేలికవుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు టీడీఆర్ బాండ్ల పైన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తన అవసరం మేరకు సేకరించిన భూములకు మాత్రమే టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. అంతేతప్ప ప్రభుత్వానికి అవసరం లేకున్నా ఎవరైనా ముందుకొచ్చి భూములిస్తాం అంటే టీడీఆర్‌లు ఇవ్వొద్దని తేల్చిచెప్పారు. ప్రభుత్వ అవసరార్దం తీసుకునే వాటికే టీడీఆర్‌లు వరిస్తాయని స్పష్టత ఇచ్చారు. టీడీఆర్ ప్రక్రియను మొత్తం ఆన్లైన్ చెయ్యాలని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా వ్యవస్థను రూపొందించాలని చెప్పారు.
డిసెంబరు 9కి ఫ్యూచర్ సిటీకి రోడ్డు పడాలి
రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న రేడియల్ రోడ్ 1 ను డిసెంబర్ 9 లోగా పూర్తి చేయాలన్నారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో అడ్డంకులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పారు. రోడ్డు నిర్మాణం నాణ్యతలో రాజీ ఉండకూడదని, భవిష్యత్‌లో ఇబ్బంది రాకుండా రోడ్డు నిర్మాణంలో వాడే మట్టి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్‌లకు ఇరువైపులా పచ్చదనం ఉండేలా చూసుకోవాలని చెప్పారు. బుద్వేల్ ఇంటర్చేంజ్ ట్రంపెట్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. బంజారాహిల్స్ నుంచి శిల్పా లే అవుట్ వరకు వేయనున్న ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణ పనుల్లో అధికారులు అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. రోడ్ల ప్లానింగ్ నిర్మాణంలో ట్రాఫిక్ విభాగాన్ని కూడా భాగస్వాముల్ని చేయాలన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించవద్దని స్పష్టం చేశారు. కాగా, సీఎం రేవంత్‌ను తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా (టాసా) జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ) మేజర్ జనరల్ జి.శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రొఫెసర్ జయశంకర్, గద్దర్‌కు సీఎం నివాళులు
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. సిద్ధాంతకర్తగా తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర అత్యంత కీలకమైనదన్నారు. జయశంకర్ ఆశయాల సాధనకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళులర్పించారు. గద్దర్ ఆట-పాట తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఇటు.. ప్రొఫెసర్ జయశంకర్, గద్దర్ జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి అందరూ పూనుకోవాలని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. జయశంకర్ జయంతి, గద్దర్ వర్ధంతి సందర్భంగా టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ ఇద్దరి చిత్రపటాలకు ఆయన నివాళులర్పించారు. అసెంబ్లీ భవనంలోని సభ్యుల లాంజ్‌లో జయశంకర్ చిత్రపటానికి స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళులర్పించారు.