Share News

మీకు మన్మోహన్‌ సహకరించినట్టు.. మాకు సహకరించండి

ABN , Publish Date - May 11 , 2026 | 05:34 AM

‘‘గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ సహకారంతో గుజరాత్‌ మోడల్‌ను అభివృద్ధి చేశారు.

మీకు మన్మోహన్‌ సహకరించినట్టు.. మాకు సహకరించండి

  • మూసీ పునరుజ్జీవం, మెట్రో, రేడియల్‌ రోడ్లు,

  • హైదరాబాద్‌- బందరు రోడ్డుకు అనుమతివ్వండి

  • ఇందుకోసం 2 గంటలు కేటాయించి సమీక్షించండి

  • తెలంగాణ ప్రాజెక్టులను ఆమోదించేందుకు పీఎంవోలో

  • ప్రత్యేక సింగిల్‌ విండో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయండి

  • 2047నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

  • ఇది కేంద్ర కార్యక్రమం కాదు.. అభివృద్ధి ఉత్సవం

  • ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): ‘‘గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ సహకారంతో గుజరాత్‌ మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు మీ సహకారంతో రాబోయే పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మన్మోహన్‌సింగ్‌ తరహాలో, ఆయన స్ఫూర్తితో మీరూ నాకు పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నా’’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైలు, రేడియల్‌ రోడ్లు, హైదరాబాద్‌-బందరు 12 లేన్ల రోడ్డుకు అనుమతులు ఇవ్వాలని, ఇందుకోసం రెండు గంటల సమయం కేటాయించి సమీక్షించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల ఆమోదం, అత్యవసర అనుమతుల కోసం ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక సింగిల్‌ విండో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా ఆదివారం పలు ప్రాజెక్టులకు వర్చువల్‌ విధానంలో ప్రధాన మంత్రి మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా హాజరై మాట్లాడారు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని, అభివృద్ధి ఉత్సవమని అభిప్రాయపడ్డారు. ఇటీవలే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయని, ఇక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆకాంక్షించారు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధి అత్యంత ప్రాధాన్య అంశాలని, మొదట దేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అని స్పష్టం చేశారు. ఆ స్ఫూర్తితోనే వికసిత్‌ భారత్‌-2047ను మోదీ ప్రకటించారని, అందులో తెలంగాణ భాగస్వామ్యం కూడా ఉందన్న విషయాన్ని గుర్తించాలని కోరారు.


దేశం విషయంలో కేంద్రంతో కలిసే ఉంటామని చెప్పారు. వికసిత్‌ భారత్‌-2047 ద్వారా భారతదేశాన్ని 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపై ప్రధాని మాట్లాడిన సమయంలోనే.. ‘తెలంగాణ రైజింగ్‌ -2047’ను దానికి అనుసంధానం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్‌కు ప్రధాని పూర్తి సహకారం అందిస్తారనే విశ్వాసం తనకు ఉందన్నారు. తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉండాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ మహా నగరాలను అభివృద్ధి చేయాలని అన్నారు. జాతీయ ప్రాధాన్యతతో ఈ మెట్రో నగరాల్లోని ప్రాజెక్టుల ఆమోదానికి పీఎంవో సింగిల్‌ విండో టాస్క్‌ఫోర్స్‌ ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టుల విషయమై ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులను అనేక సార్లు తాను కలిశానని గుర్తు చేశారు. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కూడా తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - May 11 , 2026 | 05:35 AM