Share News

తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన గద్దర్‌

ABN , Publish Date - Aug 06 , 2026 | 06:06 AM

ప్రజా యుద్ధనౌక గద్దర్‌.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రాణం పోసిన మహనీయుడని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నిత్యం రగిలించిన అసామాన్య ప్రజాకవి అని కొనియాడారు.

తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన గద్దర్‌

  • పేద వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేశారు

  • పాటనే ఆయుధంగా మార్చుకున్న వ్యక్తి: సీఎం రేవంత్‌

  • నేడు గద్దర్‌ వర్ధంతి.. ఆయన్ను స్మరించుకున్న సీఎం

హైదరాబాద్‌, ఆగష్టు 5 (ఆంధ్రజ్యోతి): ప్రజా యుద్ధనౌక గద్దర్‌.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రాణం పోసిన మహనీయుడని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నిత్యం రగిలించిన అసామాన్య ప్రజాకవి అని కొనియాడారు. గురువారం గద్దర్‌ వర్ధంతి నేపథ్యంలో ఆయన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. గద్దర్‌తో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పేద కుటుంబంలో జన్మించిన గద్దర్‌ ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించినప్పటికీ.. ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా.. సమాజంలోని పేద, బడుగు, బలహీనవర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ప్రతి మనిషికీ కూడు, గూడు దక్కాలనే మహోన్నత లక్ష్యంతో జీవితాంతం పాటనే ఆయుధంగా మార్చుకుని ప్రజల్లో చైతన్యం నింపారని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. గద్దర్‌ అందించిన సాంస్కృతిక, సాహిత్య సేవలకు గౌరవ సూచకంగా ఆయన పేరుతో తెలంగాణ ఫిల్మ్‌ అవార్డులను ఏర్పాటుచేసి సినీ కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేశామని సీఎం గుర్తుచేశారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.

Updated Date - Aug 06 , 2026 | 06:09 AM