Share News

రేపు రెండో విడత రైతుభరోసా

ABN , Publish Date - Apr 19 , 2026 | 05:48 AM

యాసంగి రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. సీఎం రేవంత్‌ సోమవారం ఈ నిధులను విడుదల చేయనున్నారు.

రేపు రెండో విడత రైతుభరోసా

  • 45,11,947 మంది రైతుల ఖాతాల్లో రూ.2,063 కోట్లు జమ

  • 2 విడతల్లో కలిపి రైతులకు రూ.5,653 కోట్ల సాయం

  • భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • మొదట మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన, తర్వాత సభకు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): యాసంగి రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. సీఎం రేవంత్‌ సోమవారం ఈ నిధులను విడుదల చేయనున్నారు. రెండో విడత కింద 45,11,947 మంది రైతుల ఖాతాల్లో రూ.2,063 కోట్లు జమకానున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో జరిగే బహిరంగ సభ నుంచే సీఎం ఈ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 73 లక్షల మంది రైతులు ఉన్నారు. యాసంగి రైతు భరోసా సాయం కింద మార్చి 23న ప్రతి రైతుకూ ఒక్కో ఎకరానికీ రూ.6వేల చొప్పున దాదాపు రూ.3,590 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు రెండో విడత కింద దాదాపు 36.72 లక్షల ఎకరాలకు చెందిన అన్నదాతలకు రైతు భరోసా అందనుంది. రెండు విడతల్లో కలిపి రైతులకు మొత్తం రూ.5,653 కోట్ల సాయం అందినట్లవుతుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. మూడో విడత నిధులను వీలైనంత త్వరగా అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాగా, సీఎం రేవంత్‌ సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కాటారం బహిరంగ సభకు వెళ్లనున్నారు.

Updated Date - Apr 19 , 2026 | 05:48 AM