సీఎం రేవంత్‌కు హార్వర్డ్ ఆహ్వానం
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:45 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అమెరికాలోని హార్వర్డ్ కెనెడీ స్కూల్ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. ఆ సంస్థ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంకు హాజరై ప్రసంగించాల్సిందిగా...
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అమెరికాలోని హార్వర్డ్ కెనెడీ స్కూల్ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. ఆ సంస్థ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంకు హాజరై ప్రసంగించాల్సిందిగా సీఎంను ఆహ్వానించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంప్‌సలో జరగనున్న ఈ కార్యక్రమానికి భారత్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే ఈ ఆహ్వానాన్ని అందుకోవడం విశేషం. ఈ సదస్సులో ‘ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంప్యూటర్ పవర్: ఇంపాక్ట్ ఆన్ లివబిలిటి అండ్ వర్క్‌ఫోర్స్’ అనే ప్యానెల్‌లో ప్రసంగించాలంటూ రేవంత్‌ను ఆహ్వానించారు. ఈ సెషన్‌లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఏఐ ఎకో సిస్టమ్ అభివృద్ధి, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భూమి, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణ, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రసంగించేందుకు సీఎంను ప్రత్యేకంగా ఆహ్వానించారని అధికారులు తెలిపారు. ఇటీవల రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో నిర్వాహకులు ఆయనను ప్రత్యేకంగా కలిసి సింపోజియంపై చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమీ రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, ఏఐ పాలన, జియో పాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, ఎనేబ్లింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు వివరించారు.