నేను బలహీనుల పక్షం
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:49 AM
తాను ఎప్పుడూ బలహీనుల పక్షానే ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మాదిగలు బలహీనులు అయినందునే ఎస్సీ వర్గీకరణ విషయంలో....
రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా.. మాదిగల వైపు నిలబడ్డా
మాదిగ ఉద్యోగుల అభినందన సభలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): తాను ఎప్పుడూ బలహీనుల పక్షానే ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మాదిగలు బలహీనులు అయినందునే ఎస్సీ వర్గీకరణ విషయంలో వారికి అండగా నిలిచానన్నారు. ఈ క్రమంలో తనపై ఎన్ని రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చినా వారి వైపే ఉన్నానని తెలిపారు. మాదిగల సమస్యలను ముందుండి పరిష్కరిస్తున్నప్పుడు వెనుక నుంచి తనపై జరిగే దాడులను మాదిగలంతా ఆపి, అండగా నిలవాలని కోరారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు మాదిగ ఉద్యోగుల కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్‌రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘‘ఈ ప్రభుత్వం మీది. ప్రజాపాలన రావాలి.. ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఆధిపత్యం చెలాయిస్తున్న వారు ఓవైపు, చచ్చినా సరే ఎన్నికల్లో గెలవాలని చిత్తశుద్ధి తో మేం చేసిన ప్రయత్నం మరోవైపు. మాటలు, మూటలతో అయితే ఎన్నికల్లో మేం గెలిచేవాళ్లం కాదు’’ అని రేవంత్ అన్నారు.
నేను అందరివాణ్ని..
తాను అందరివాణ్ని అని, తనను ఎలా పిలిచినా ఇబ్బంది లేదని సీఎం రేవంత్ అన్నారు. చిన్న వయసులో సీఎంగా తనకు దక్కిన ఈ అవకాశాన్ని.. పది మందికి సహాయం చేయడానికేనని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రభుత్వానికి కళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడర్లు ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం అన్నారు. ప్రభుత్వ పథకాలు పేదలకు చేరాలంటే ఉద్యోగులంతా కష్టపడి పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదేనన్నారు. దళితులకు పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవని సీఎం అన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు పరిమితంగా ఉందన్నారు. దారిద్య్ర రేఖకు దిగువలో ఉన్న జాతి ముందుకు నడవాలంటే విద్య అవసరమని, అందుకే విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని ప్రక్షాళన చేస్తున్నానని తెలిపారు.
గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు ఇచ్చింది..
గత ప్రభుత్వం తమ పిల్లలు రాజ్యాలు ఏలాలని కోరుకుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రం బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చిందని, చెప్పులు కుట్టుకోమన్నదని సీఎం రేవంత్ విమర్శించారు. తాను మాత్రం చెప్పులు కుట్టుకున్న జాతే ఈ రాజ్యాన్ని నడపాలని ఆకాంక్షించానని చెప్పారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంటే రెండు కులాల మధ్య పంచాయితీ కాదన్నారు. సమాజంలో ఆయా కులాలు ఎదుర్కొంటున్న వివక్ష, అసమానతల ఆధారంగానే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. కాగా, ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు ద్వారా మాదిగ సమాజానికి విద్య, ఉద్యోగావకాశాల్లో గణనీయమైన పురోగతి సాధ్యమైందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. త్వరలో లోయర్ ట్యాంక్‌బండ్‌లో అంబేద్కర్ టవర్, కాచిగూడలో జగ్జీవన్ భవన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, వేముల వీరేశం, తోట లక్ష్మీకాంత్‌రావు, కాలె యాదయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.ప్రీతమ్, ప్రొఫెసర్ కాశీం పాల్గొన్నారు.