Share News

ఏఐతో ఉద్యోగం కోల్పోతే.. కంపెనీలు పరిహారం చెల్లించాలి

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:50 AM

ఓపెన్‌ ఏఐ సంస్థ చాట్‌ జీపీటీని ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత భాగమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

ఏఐతో ఉద్యోగం కోల్పోతే.. కంపెనీలు పరిహారం చెల్లించాలి

  • ఏఐ కంపెనీలకు ‘పీపుల్‌ క్రెడిట్స్‌’ విధానం తీసుకొస్తాం

  • ఉద్యోగాలు కోల్పోయినవారికి ప్రభుత్వపరంగా నైపుణ్య శిక్షణ

  • హార్వర్డ్‌ కెన్నడీ స్కూల్‌ ఏఐ సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఓపెన్‌ ఏఐ సంస్థ చాట్‌ జీపీటీని ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత భాగమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఏఐ కారణంగా అనేకమంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ సమస్యకు తమ ప్రభుత్వం వినూత్న పరిష్కారం అమల్లోకి తేబోతుందని తెలిపారు. ఏఐ వల్ల ఉద్యోగం కోల్పోతే.. ఆ ఉద్యోగికి కంపెనీ పరిహారం చెల్లించేలా ఒక విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. కంపెనీలు విడుదల చేసే కాలుష్యానికి కార్బన్‌ క్రెడిట్స్‌ ఉన్నవిధంగానే.. ఏఐ కంపెనీలకు ‘పీపుల్‌ క్రెడిట్స్‌’ విధానాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు వివరించారు. అమెరికాలోని బోస్టన్‌ సిటీలో ఉన్న హార్వర్డ్‌ విశ్వ విద్యాలయంలోని హార్వర్డ్‌ కెన్నడీ స్కూల్‌.. ఏఐపై శుక్రవారం రాత్రి నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. మానవజాతి గొప్ప ఆవిష్కరణల్లో ఏఐ కీలకమైందని.. కానీ, ఇది రెండు వైపుల పదును ఉన్న కత్తి లాంటిదని అన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా చూపవచ్చని హెచ్చరించారు. ఏఐ సాంకేతికత భవిష్యత్తులో మరింత శక్తిమంతమవుతుందని తెలిపారు. ఏఐతో ప్రాథమిక స్థాయి ఉద్యోగాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

ఉద్యోగులను తొలగిస్తే మాకు కష్టమే..

ఫార్మా, సాఫ్ట్‌వేర్‌, హెల్త్‌ కేర్‌, లైఫ్‌ సైన్సైస్‌, మ్యానుఫాక్చరింగ్‌, ఏరోస్పేస్‌, రక్షణ, రిటైల్‌ రంగాలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ నగరం ఒక నాలెడ్జ్‌ సెంటర్‌ అని సీఎం తెలిపారు. ఈ రంగాల్లో భారీగా ఉద్యోగులను తొలగిస్తే తాము సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అందుకే భారత్‌ ఫ్యూచర్‌ సిటీ అనే కొత్త నగరాన్ని నిర్మిస్తున్నామని, అందులో ఒక భాగాన్ని ఏఐ సిటీగా అభివృద్థి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడ అన్ని ఏఐ సంస్థలకు ఒకేచోట అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఏఐ అభివృద్ధిలో ప్రపంచానికి కేంద్రంగా భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తామని ప్రకటించారు. ఏఐ మార్చలేని పర్యాటకం, గ్రీన్‌ ఎనర్జీ, ఎలక్ర్టిక్‌ వాహనాలు, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో ఉద్యోగాలను పెంచుతున్నట్లు వివరించారు. గ్రీన్‌ ఎనర్జీ ఆధారంగా తయారీ రంగాన్ని అభివృద్థి చేసి చైనా+1కు ప్రత్యామ్నయంగా ఎదగాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయే వారికి పున:శిక్షణ అందించేందుకు హార్వర్డ్‌ వంటి ప్రపంచ స్థాయి వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఏఐ, గ్రీన్‌ ఎనర్జీ, ఇన్‌ఫ్రా రంగాలు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 05:50 AM