21 ఏళ్లకే చట్టసభలకు!
ABN , Publish Date - Jul 26 , 2026 | 05:32 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. యువతకు సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు. దేశంలో 21 ఏళ్లు నిండిన యువతకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలని అన్నారు.
జెన్ జీకి పోటీ చేసే అవకాశం కల్పించాలి.. వారి గళం చట్టసభల్లో వినిపించాలి
అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం
వచ్చే సమావేశాల్లోనే దీనిపై చర్చిస్తాం
బిల్లును పార్లమెంటులో ఆమోదించేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది
ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమే
కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీలో సీఎం రేవంత్
‘‘రాజకీయ పార్టీలను, కార్యకర్తలను కేంద్ర ప్రభుత్వం ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్, సీబీఐ కేసులు సహా పలు మార్గాల ద్వారా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ, నీట్ పరీక్ష వ్యవహారంలో నరేంద్రమోదీ నిరంకుశ పాలనను, లాఠీలను, బాష్పవాయు గోళాలను మీ గుండె ధైర్యంతో ఎదిరించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారు. ఈ సందర్భంగా మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ సునామీ ఇంతటితో ఆగొద్దు. మీ మాట చట్టసభల్లో వినిపించాలి. అది ప్రపంచానికి చేరాలన్నదే నా ఆలోచన’’
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. యువతకు సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు. దేశంలో 21 ఏళ్లు నిండిన యువతకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలని అన్నారు. వారిని చట్టసభలకు పంపించే బాఽధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ మేరకు 21 ఏళ్లు నిండిన యువతకు చట్టసభల్లో అవకాశం కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఆగష్టు మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటుచేసి.. ఈ అంశంపై చర్చించి, తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపిస్తామన్నారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడి, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం రాత్రి నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంఘీభావ కొవ్వొత్తుల ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొన్నారు.
ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘మీ సమస్యలను మీరే చెప్పుకొనేందుకు, మీ గళం వినిపించేందుకు, సమస్యలను లేవనెత్తేందుకు లోక్‌సభ, రాజ్యసభలో యువత కు అవకాశం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. పార్లమెంటులో రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలో ఆ బిల్లును ఆమోదించేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని హామీ ఇస్తున్నా. ఐటీ, విద్యాశాఖ, ఇతర అత్యంత కీలకమైన శాఖలకు 21 ఏళ్లు నిండిన యువత మంత్రులైతే.. తప్పకుండా దేశ భవిష్యత్ మారుతుంది. కచ్చితంగా ప్రపంచంతో పోటీ పడతాం’’ అని సీఎం రేవంత్ అన్నారు. పార్లమెంటులో 543 మంది ఎంపీలు ఉన్నారని, కానీ.. అందులో జెన్‌జీ ప్రాతినిధ్యం కేవలం ఒక్క శాతానికి లోపే ఉందని పేర్కొన్నారు. దేశంలో 30 శాతం జనాభా ఉన్న యువ కెరటాలకు చట్టసభల్లో ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
ఇతర దేశాల్లో 21 ఏళ్లకు ప్రధాని కావొచ్చు..
61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 ఏళ్లకే ఓటుహక్కును రాజీవ్‌గాంధీ కల్పించారని సీఎం రేవంత్ తెలిపారు. 73, 74వ సవరణలు చేసి 21 ఏళ్లకే స్థానిక సంస్థల్లో, జడ్పీ చైర్మన్‌లుగా, మేయర్లుగా అవకాశాన్ని మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు, కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. సివిల్ సర్వీసులకు 21 ఏళ్ల అర్హత ఉండడం వల్లే 35 ఏళ్ల క్రితం శ్రీలక్ష్మి 21 ఏళ్లకే ఐఏఎస్ అయ్యారని, ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అనన్య 22 ఏళ్లకు ఐఏఎస్ అయ్యారని తెలిపారు. వీరే కాకుండా 32 ఏళ్ల క్రితం 22 ఏళ్లకే ఐపీఎస్ సాధించిన సీవీ ఆనంద్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా ఉన్నారని గుర్తు చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు 25 ఏళ్లు, శాసనమండలి, రాజ్యసభకు వెళ్లేందుకు 30 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధన పెట్టారని తెలిపారు. కానీ, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 ఏళ్లు పూర్తయితే చట్టసభలకు వెళ్లవచ్చని, సింగ్‌పూర్‌లో 21 ఏళ్లకు దేశ ప్రధాని కూడా కావచ్చని అన్నారు.