ఆ నేరం చేసిన నువ్వు.. జాతిపితవెలా అవుతావ్: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:22 AM
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో మొగుడూ పెళ్లాలు మాట్లాడుకునే ఫోన్లు కూడా విన్నారు. వాళ్ల బతుకు చెడ. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినిమా తారలు.. ఎవరి ఫోన్లూ వదల్లేదు.
మొగుడూ పెళ్లాలు సహా ఎవరినీ వదల్లేదు
క్షమాపణ అడగాల్సిందిపోయి సిగ్గులేని మాటలా?
హరీశ్, కేటీఆర్ ముఖాలకు తొడుగులేసి విచారణకు పట్టుకు రావాల్సింది
ప్రొఫెసర్ జయశంకర్, సోనియా జాతిపితలు అవుతారు
అన్ని మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ జెండానే ఎగరాలి
బీఆర్‌ఎస్ హయాంలో నల్లగొండను పడావు పెట్టారు
మేం జానారెడ్డి అంత మంచివాళ్లం కాదు
మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
‘యంగ్ ఇండియా’ స్కూల్‌కు శంకుస్థాపన
నల్లగొండ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో మొగుడూ పెళ్లాలు మాట్లాడుకునే ఫోన్లు కూడా విన్నారు. వాళ్ల బతుకు చెడ. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినిమా తారలు.. ఎవరి ఫోన్లూ వదల్లేదు. మంది ఫోన్లు వినే వాడు మనిషేనా? అలాంటి సన్నాసులకు పోలీసులు నోటీసులిస్తే.. జాతిపితకు నోటీసులిస్తారా? అంటున్నారు. ఎవడికి రా నువ్వు జాతిపితవు? వినోద్‌రావు, దయాకర్‌రావు, హరీశ్‌రావు, కూకట్‌పల్లి కృష్ణారావుకు అయితే జాతిపితవేమో కానీ, మా నల్లగొండ, పాలమూరు వాళ్లకు నువ్వెందుకు జాతిపితవు అవవుతావు? మంది ఫోన్లు వినడం వంటి క్రూరమైన, ఘోరమైన నేరం చేసిన నువ్వెలా జాతిపితవు అవుతావు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో జరిగిన ప్రజాపాలన ప్రగతిబాట సభకు విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి రూ.200 కోట్లతో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు రూ.1300 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు హరీశ్‌రావు, కేటీఆర్‌ను ముఖాలకు ముసుగులు తొడిగో, ముఖానికి మసిపూసో విచారణకు పట్టుకు రావాల్సిందని అన్నారు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతారని, తెలంగాణ ఇస్తే ఏపీలో పార్టీ లేకుండా పోతుందని, కేంద్రంలో అధికారం కోల్పోతామని, తెలంగాణలోనూ అధికారం రాదని తెలిసినప్పటికీ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా జాతిపిత అవుతారని చెప్పారు. జాతిపిత అవడానికి తెలంగాణకు ఏం చేశారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వేల కోట్ల విలువ చేసే జున్వాడ, ఎర్రవెల్లి ఫాంహౌస్, మొయినాబాద్‌లోని హరీశ్‌రావు ఫాంహౌస్, మీ టీవీలు, పేపర్లు, వేలాది కోట్లతో నిర్మించుకున్న పంజాగుట్ట గడీని తెలంగాణ సమాజానికి ఇస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదని, చిన్న అధికార బాధ్యత కూడా ఆమెకు ఇవ్వలేకపోయిన మీకు జాతిపిత అర్హత ఎక్కడిదని నిలదీశారు. తెలంగాణను దోచుకున్న దొంగలు, లుచ్చాలు జాతిపితలు ఎలా అవుతారని ప్రశ్నించారు. చేసిన పాపానికి క్షమాపణ అడగకుండా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

కక్షతోనే నల్లగొండను పడావు పెట్టారు..
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నల్లగొండ జిల్లాపై కక్ష, కసి పెంచుకుని ఇక్కడి ప్రాజెక్టులను పడావు పెట్టారని సీఎం రేవంత్ ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొట్లాడి తెచ్చిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని.. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేయలేదని చెప్పారు. కక్షతోనే ఆ పనులు చేయలేదన్నారు. మళ్లీ ప్రజాప్రభుత్వం వచ్చాక తాము ఈ ప్రాజెక్టును మొదలుపెడితే అక్కడ ప్రమాదం జరిగి, కార్మికులు చనిపోయారని ఆ సందర్భంలో కనీస మానవత్వం లేకుండా మామా అల్లుళ్లు, బావాబామ్మర్దులు ఎస్‌ఎల్‌బీసీ ఆగిపోయిందని సంబరపడ్డారని దుయ్యబట్టారు. నల్లగొండపై ఒంటి నిండా విషం నింపుకొని మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ నేతలకు ఇక్కడ ఓట్లడిగే హక్కు లేదన్నారు.
123 మునిసిపాలిటీల్లోనూ కాంగ్రెసే గెలవాలి
నల్లగొండలో 18 మునిసిపాలిటీల్లోనూ కాంగ్రె్‌సను గెలిపిస్తారనడంలో తనకెలాంటి సందేహం లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 123 మునిసిపాలిటీల్లోనూ కాంగ్రెస్సే గెలవాలని పిలుపునిచ్చారు. తమ రెండేళ్ల పాలనలో రూ.17,472 కోట్ల నిధులు వెచ్చించి మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేశామని, నల్లగొండ జిల్లాలో రూ.2,028 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. సభకు ఇందిరమ్మ చీరలు కట్టుకుని పుట్టింటికి వచ్చినట్లు వచ్చిన అక్కాచెల్లెళ్లను చూస్తుంటే తనకు సంతోషంగా ఉందని చెప్పారు. పదేళ్ల పాటు నిరీక్షించిన పేదలకు రేషన్‌కార్డులు ఇచ్చామని, 85 శాతం మంది పేదలకు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డుబియ్యాన్ని రైస్‌మిల్లులకు, బర్రెలకు దాణాకు వాడారే తప్ప, ఎవరూ తినలేదని చెప్పారు. 25.30 లక్షల మంది రైతులకు రూ.25 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని వెల్లడించారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9వేల కోట్ల రైతుభరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో వేశామని, మునిసిపల్ ఎన్నికలయ్యాక మరో రూ.9వేల కోట్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన ఆడబిడ్డలందరూ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మాత్రమే ఓట్లేస్తే.. బీఆర్‌ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావని చెప్పారు. పార్టీలు, రాజకీయాలకతీతంగా పేద, బలహీన వర్గాల పిల్లలందరికీ నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతోనే 100 నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రూ.20 వేల కోట్లతో నిర్మిస్తున్నామని వివరించారు.
ఏప్రిల్‌లో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, ఎమ్మెల్యేలంతా అవి సరిపోవడం లేదంటున్నారని రేవంత్ చెప్పారు. వారందరికీ హామీ ఇస్తున్నానని, ఏప్రిల్‌లో మరికొన్ని లక్షల ఇళ్లను మంజూరు చేయబోతున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రూ.20,500 కోట్లతో 4.50లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు.
జానారెడ్డి అంత మంచివాళ్లం కాదు
మిర్యాలగూడలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని చెబుతున్నారని, ఆయన నక్కజిత్తులు నడవవని రేవంత్ అన్నారు. ఆయన వీపు చింతపండు చేయడం పక్కా అని హెచ్చరించారు. జానారెడ్డి సొంత కుమారుడిని పక్కనబెట్టి ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేని చేస్తే ఎర్రవెల్లికి వెళ్లి మోకరిల్లాడని, సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డిని ఓడించడానికి ఇంటింటికీ తిరిగాడని దుయ్యబట్టారు. తాము జానారెడ్డి అంత మంచివాళ్లం కాదని, కాంగ్రెస్ శ్రేణుల జోలికొస్తే వీపు చింతపండు చేస్తామని హెచ్చరించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడతాం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కృష్ణా జలాల హక్కులను సాధించడంతో పాటు ఆయకట్టును పరిరక్షిస్తామని, వరి సాగు చేసే రైతులకు అండగా ఉంటామని తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన 1100 మంది బిడ్డలు జాతిపితలవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తాను కూడా ఆనాడు తెలంగాణ కోసం మంత్రి పదవికి సైతం రాజీనామా చేసి పోరాడానని, నిరాహార దీక్ష చేశానని గుర్తుచేశారు. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బలహీనవర్గాల పిల్లలకు కార్పొరేట్ విద్యనందించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ని నిర్మిస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.