Share News

వెయ్యి కోట్లిచ్చినా జగ్గారెడ్డి లాంటి నాయకుడు మనకు దొరకడు

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:25 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రాముడైతే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హనుమంతుడని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.వెయ్యి కోట్లిచ్చినా జగ్గారెడ్డి లాంటి నాయకుడు మనకు దొరకరని తెలిపారు.

వెయ్యి కోట్లిచ్చినా జగ్గారెడ్డి లాంటి నాయకుడు మనకు దొరకడు

  • రాహుల్‌గాంధీ రాముడైతే.. ఆయన భక్తుడు హనుమంతుడు జగ్గారెడ్డి

  • రాముడు ఏం ఆదేశిస్తే.. హనుమంతుడు అది పాటించాలి

  • జగ్గారెడ్డి ఎక్కడ పోటీచేయాలో రాహుల్‌గాంధీ చెబుతారు

  • నాకంటే ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండేది జగ్గారెడ్డే

  • సంగారెడ్డిలో జగ్గారెడ్డిని ఓడగొట్టుకున్న దురదృష్టవంతులు మీరు

  • ఓడిపోయినా మీతోనే ఉన్నందుకు అదృష్టవంతులు కూడా మీరే

  • నిర్మలక్కకు ఇచ్చేది ఇస్తా.. జగ్గన్నకి ఇచ్చేది జగ్గన్నకు ఇస్తా

  • ఆయన గురించి రాహుల్‌గాంధీ డిసైడ్‌ చేస్తారు.. ఏం జరుగుతుందో నాకూ తెలియదు

  • కర్ణాటకలో బోసురాజును మంత్రిని చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు

  • సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

సంగారెడ్డి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రాముడైతే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హనుమంతుడని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.వెయ్యి కోట్లిచ్చినా జగ్గారెడ్డి లాంటి నాయకుడు మనకు దొరకరని తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ సభలో జగ్గారెడ్డిపై సీఎం ప్రశంసలు కురిపించారు. రాహుల్‌గాంధీ ఏం ఆదేశిస్తే జగ్గారెడ్డి అదే పాటిస్తారని చెప్పారు. జగ్గారెడ్డి ఎక్కడ పోటీచేయాలో, ఆయనకు ఏం ఉపకారం చేయాలో రాహుల్‌గాంధీ చూసుకుంటారని తెలిపారు. ఆ విషయం తనకు కూడా తెలియదని అన్నారు. కర్ణాటకలో బోసురాజుకు మంత్రి పదవి ఇచ్చి, ఆ తర్వాత ఎమ్మెల్సీని చేశారని గుర్తుచేశారు. కుటుంబం, పిల్లల కంటే సంగారెడ్డి ప్రజలతోనే జగ్గారెడ్డి ఎక్కువగా ఉంటారని, తనకంటే కూడా ప్రజాజీవితంలో ఎక్కువగా గడుపుతారని ప్రశంసించారు. ఆయనకే మొదటి మార్కులు వేస్తానని అన్నారు. ‘నేను ఎన్నికల్లో పోటీచేయను అని ఇంకోసారి అనొద్దు జగ్గన్నా’ అని సీఎం హితవు పలికారు. ‘జగ్గారెడ్డిని ఓడగొట్టుకున్నందుకు సంగారెడ్డి ప్రజలు దురదృష్టవంతులు... ఓడిపోయినా ఆయన మీకోసమే పనిచేస్తున్నందుకు అదృష్టవంతులు కూడా మీరే. నిర్మలక్కకు ఇచ్చేది అక్కకు ఇస్తా.. జగ్గన్నకు ఇచ్చేది జగ్గన్నకు ఇస్తా’ అని తెలిపారు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో 2017లో సంగారెడ్డిలో జరిగిన రాహుల్‌గాంధీ సభతో తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుందని, ఆ ప్రభావమే నేడు అధికారంలోకి రావడానికి దోహదపడిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. జగ్గారెడ్డి చేపట్టే కార్యక్రమాలు తమ పార్టీకి దిక్సూచిలా పనిచేస్తాయని తెలిపారు.

Updated Date - Aug 16 , 2026 | 06:26 AM