కార్మిక పక్షపాతి సీఎం రేవంత్
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:28 AM
సీఎం రేవంత్‌రెడ్డి కార్మిక పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం కొనియాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై....
శంకర్‌గౌడ్ కుటుంబాన్ని ఆదుకుంటాం: వేముల వీరేశం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది మంచి మనసు: కవ్వంపల్లి
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి కార్మిక పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం కొనియాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించడం పట్ల సంతాపం ప్రకటించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కొందరు ఆర్టీసీ కార్మికులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు పిట్టల్లా రాలిపోతుంటే బీఆర్‌ఎస్ నేతలు ఆనాడు సంబరాలు చేసుకున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దుయ్యబట్టారు. ఆర్టీసీని రాజకీయం చేస్తుంది బీఆర్‌ఎస్ నేతలేనని ఆరోపించారు. సీఎం రేవంత్ మంచి మనసున్న వ్యక్తి అని, ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవడమే అందుకు నిదర్శనమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆర్టీసీ కార్మికులతో సర్కారు చర్యలు సఫలం కావడం రాష్ట్ర అభివృద్ధికి పునాది అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు.
సమ్మె విరమణలో ఐఎన్‌టీయూసీ కీలకపాత్ర: సంజీవరెడ్డి
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, సమ్మె విరమణలో ఐఎన్‌టీయూసీ కీలక పాత్ర పోషించిందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి అన్నారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి సర్కారు అంగీకరించడం కాంగ్రెస్ ప్రజాపాలనకు నిదర్శనమని కొనియాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 52 రోజుల పాటు కార్మికులు సమ్మె చేశారని.. ఆనాడు 34 మంది ప్రాణాలు కోల్పోయారని ఓ ప్రకటనలో గుర్తు చేశారు.
సర్కారు నిర్ణయం హర్షణీయం: కూనంనేని
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సర్కారు సముచితంగా స్పందించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పదేళ్లపాటు విచ్ఛిన్నమైన ఆర్టీసీని, కార్మికుల మనోగతానికి అనుగుణంగా పరిష్కరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. గత పాలకులు దుర్మార్గంగా వ్యవహరించి ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేశారని, ఆ తప్పులను ప్రస్తుత ప్రభుత్వం సరిదిద్దడం హర్షణీయమని పేర్కొన్నారు. విలీనం దిశగా సర్కారు కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.