CPI Centenary Celebrations: ఎర్ర ఫ్లెక్సీలపై సీఎం రేవంత్ ఫొటోలు
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:37 AM
భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన నేపథ్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు ఖమ్మం ముస్తాబవుతోంది.
సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు విస్తృత ప్రచారం
18న ఖమ్మంలో భారీ ప్రదర్శన, బహిరంగసభ
ఖమ్మం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన నేపథ్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు ఖమ్మం ముస్తాబవుతోంది. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఈ నెల 18న మధ్యాహ్నం 3గంటలకు బహిరంగసభను నిర్వహించనున్నారు. అంతకుముందు భారీ ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మహాసభల ప్రచార ఫ్లెక్సీల్లో కమ్యూనిస్టు నేతల ఫొటోలతోపాటు సీఎం ఫొటోలను కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఖమ్మంజిల్లాతో పాటు పలు జిల్లాలోని ప్రధాన కూడళ్లలో ముగింపు ఉత్సవాల వైభవాన్ని చాటుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఎర్రజెండాలతో స్వాగత ద్వారాలు, తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవాల ముగింపు సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు పలు రాష్ట్రాల సీపీఐ నేతలు హాజరుకాన్నారు. 18న బహిరంగసభ, 19నుంచి 21వరకు జాతీయ కార్యవర్గం, కౌన్సిల్ కమిటీ సపమవేశాలు కూడా జరగనున్నాయి. శతాబ్ది ఉత్సవ ముగింపు సభలకు పలు దేశాలనుంచి కమ్యూనిస్టు పార్టీ విదేశీ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు.