డేటా సెంటర్లకు ఏం రాయితీలిస్తున్నారు?
ABN , Publish Date - Feb 18 , 2026 | 04:16 AM
డాటా సెంటర్లకు దేశంలో వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
పక్క రాష్ట్రాలలో అధ్యయనం చేయండి
ఉదారంగా భూపరిహారం ఇవ్వండి
కంపెనీల కోసం వేగంగా భూసేకరణ,మౌలిక సదుపాయాలు కల్పించడం ముఖ్యం
అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 17(ఆంధ్ర జ్యోతి): డాటా సెంటర్లకు దేశంలో వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలు, వారికి అవసరమైన భూమి, ఇతర వసతులపై సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. భూ కేటాయింపులు హేతుబద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, భూసేకరణ సమస్యల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భూ పరిహారం విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. రైతులను పిలిచి, మాట్లాడి సంతృప్తి చెందేలా పరిహారం నిర్ణయించాలని చెప్పారు. వేల కోట్లతో పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూమిపై పెట్టే పెట్టుబడి చాలా స్వల్పమని అన్నారు. కంపెనీలకు సకాలంలో భూమి, ఇతర వసతులు అందుబాటులో ఉంచితే త్వరగా పనులు పూర్తి చేసుకుంటారని సూచించారు. సమావేశంలో సీఎస్ కె.రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.