Share News

పోలీసు నియామకాల్లో రాజకీయ జోక్యం!

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:24 AM

పోలీస్‌ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 7437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి.

పోలీసు నియామకాల్లో రాజకీయ జోక్యం!

  • ప్రక్రియకు భంగం కలిగించేందుకు కొన్ని పార్టీల యత్నం

  • 7437 పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రికి నిఘావర్గాల నివేదిక

  • అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 4, (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 7437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పోలీస్‌ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా, పూర్తి పాదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. నియమ నిబంధనలను అనుసరించాలని.. ఎలాంటి లోపాలకూ ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు. ప్రశ్న పత్రాల తయారీ, ముద్రణ, రవాణా.. ఇలా అన్నింటా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల భద్రతపై ప్రత్యేకంగాదృష్టి సారించాలని.. కోచింగ్‌ సెంటర్స్‌ పై ప్రత్యేక నిఘా పెట్టాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై సోషల్‌ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా అకౌంట్లపై సైబర్‌ క్రైమ్‌ విభాగం ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యేదాకా సైబర్‌ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్‌ విభాగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ అత్యవసర సమావేశంలో సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ వి.శేషాద్రి, డీజీపీ సీవీ ఆనంద్‌, హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శిఖా గోయల్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వి.వి.శ్రీనివాస రావు, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 05:26 AM