డ్రగ్స్‌తో రెండోసారి పట్టుబడితే జైలుకే..!
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:08 AM
విద్యాలయాల్లో మత్తుమందుల ఆనవాళ్లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
విద్యాసంస్థల్లో మత్తు ఆనవాళ్లు ఉండొద్దు.. డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలదే బాధ్యత
కఠిన చట్టం కోసం అధ్యయనం చేయండి.. సిగ్నల్స్ ఫ్రీ ప్రయాణం కోసం కసరత్తు
ఔటర్ ప్రమాదాలపై నిరంతర నిఘా.. డ్రగ్స్, ట్రాఫిక్‌పై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్, జూలై 24(ఆంధ్రజ్యోతి): విద్యాలయాల్లో మత్తుమందుల ఆనవాళ్లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడానికి అవసరమైన చట్టాన్ని రూపొందించడానికి అధ్యయనం చేయాలని చెప్పారు. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత, డ్రగ్స్ అంశాలపై శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా సంస్ధల్లో డ్రగ్స్ నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆవరణలో మత్తుమందులు ప్రవేశిస్తే యాజమాన్యాన్ని నేరుగా బాధ్యులను చేయాలని చెప్పారు. క్యాంపస్ బయట మత్తుమందులు తీసుకున్నా వారి కదలికలు, ప్రవర్తనను గుర్తించి చర్యలు తీసుకునే వ్యవస్ధను విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి విద్యార్ధి అసహజ ప్రవర్తనను మొదట విద్యాసంస్థ భద్రతా కమిటీలే గుర్తించాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ సమాచారాన్ని అందించేందుకు ప్రతి విద్యా సంస్ధ ఆవరణలో టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మత్తుమందులకు అలవాటు పడిన విద్యార్ధిని గుర్తించడం, మాన్పించడం, మాట వినకపోతే శిక్షించడం ఇలా మూడు దశలను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన వారిని డీ అడిక్షన్ సెంటర్‌కు తరలిస్తున్నారని, రెండో సారి డ్రగ్స్‌తో పట్టుబడితే మాత్రం కఠినంగా శిక్షించే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. డ్రగ్స్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే చట్టాన్ని రూపొందించేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈగల్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ల వివరాలను సీఎంకు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ఇది కేవలం ఈగల్ ఫోర్స్ బాధ్యత మాత్రమే కాదని, ప్రతీ పోలీసు అధికారి ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. రెండు మూడు నెలలకు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలని సూచించారు. ట్రాఫిక్ విషయంలో నిబంధనల కంటే క్రమబద్దీకరణకు అత్యంత ప్రాధాన్యంఇవ్వాలని చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఎక్కడిపడితే అక్కడ వాహనాలు నిలపకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తుండాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకుని వచ్చేందుకు అవసరమైన చోట అండర్‌పా్‌సలు, ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించాలని, సాధ్యమైనంత వరకు సిగ్నల్స్ వద్ద వాహనాలు కదులుతూ ఉండేలా చూడాలని సీఎం చెప్పారు.