హైదరాబాద్‌లోని 3 కార్పొరేషన్లలో ప్రత్యక్ష పరిశీలనకు వస్తా!
ABN , Publish Date - Feb 18 , 2026 | 04:25 AM
రాజధానిలోని మూడు నగర పాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
కమిషనర్లు ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో ఉండాలి.. సమీక్షలో రేవంత్
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్ర జ్యోతి): రాజధానిలోని మూడు నగర పాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కమిషనర్లు ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. తాను ప్రత్యక్ష పరిశీలనకు వస్తానని.. చెత్త కనిపిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రకటనల ఆదాయం పెంపునకు పలు సూచనలు చేశారు. ప్రధాన కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిపై సీసీ కెమెరాలు, ప్రకటనల బోర్డులు, ఎలక్ట్రిక్ స్ర్కీన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేటు భూముల్లోనూ బహుళ అంతస్తుల పార్కింగ్, స్కై వాక్ మార్కెట్లకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. హైదరాబాద్ మహానగరంలో పెద్ద మొత్తంలో ప్రకటనల బోర్డులు కనిపిస్తున్నా.. ఆశించిన ఆదాయం రాకపోవడంపై సీఎం అధికారులను ప్రశ్నించారు. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరులో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్నీ నగరంలో వస్తున్న రాబడినీ పోల్చి చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్న ప్రకటనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రకటనలకు 10 శాతం బోర్డులు కేటాయించాలని స్పష్టం చేశారు. ఆదాయం సమకూర్చే మార్గాలపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. దాన్ని పరిశీలించిన ఆయన.. పలు సూచనలు చేశారు. మూడు నగరపాలక సంస్థలతోపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో వీధి దీపాల నిర్వహణకు యూనీకోడ్ పద్ధతిని అనుసరించాలని ఆదేశించారు. మూడు నగరపాలక సంస్థల పరిధిలో పార్కుల వివరాలు సేకరించాలని, వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
23న క్యాబినెట్ ముందుకు..
హైదరాబాద్‌లో ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న అవకాశాలపై పురపాలక శాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వీటిపై మంగళవారం జరిగిన సమావేశంలో సీఎం చర్చించారు. ఈ ప్రతిపాదనలను ఈ నెల 23న జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. క్యాబినెట్ ఆమోదం పొందితే హోర్డింగులు, వ్యాపార ప్రకటనలపై పురపాలక శాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మేయర్లు, చైర్మన్లకు ఒక రోజు శిక్షణ
రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలను వివరించాలని సూచించారు. తాను సమావేశానికి హాజరై, వారితో మాట్లాడతానని తెలిపారు. ఈ సమీక్షలో జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.