కల్తీ నిరోధానికి కఠిన చట్టం
ABN , Publish Date - Jul 19 , 2026 | 05:49 AM
ఆహారం, ఔషధాల కల్తీ నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టంపై శనివారం ఎంసీహెచ్‌ఆర్డీలో సీఎం సమీక్ష నిర్వహించారు.
అమల్లో ఉన్న దేశాలను సందర్శించి రూపొందించండి.. అధికారులతో సీఎం
సమాచార సేకరణకు టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలని సూచన
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఆహారం, ఔషధాల కల్తీ నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టంపై శనివారం ఎంసీహెచ్‌ఆర్డీలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వాడుతుండటంతో ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారని సీఎం తెలిపారు. వ్యవసాయంలోనూ ఎరువులు, పురుగుల మందుల వాడకం భారీగా పెరగడంతో పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు బయటపడి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని, వాటిని దిగుమతి చేసుకోవడానికీ విదేశాలు నిరాకరిస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో పలు రకాల వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్నారని, కానీ అవి సేంద్రియ ఉత్పత్తులే అని నిర్ధారించేందుకు సరైన వ్యవస్థలు లేవని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు ఉన్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఆ నివేదికల ఆధారంగా బిల్లు రూపొందించి శాసనసభలో సమగ్ర చర్చ చేపడతామని తెలిపారు. ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా స్వీకరించాలన్నారు. కల్తీలకు సంబంధించి సమగ్ర సమాచార సేకరణకు విజిల్ బ్లోయర్లను నియమించాలని, టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనిని ముందుగా క్యూర్ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేయాలన్నారు. ఇక్కడ అమలులో వచ్చే లోటుపాట్ల ఆధారంగా ముందుకు సాగాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎం సలహాదారు, ఎక్స్ ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య అధికారులు పాల్గొన్నారు.