ప్రభుత్వ కార్యాలయాలకుభవనాలపై పునఃపరిశీలన
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:11 AM
అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వవిభాగాలు, కార్యాలయాలకు.. ఇతర ప్రభుత్వ భవంతులలో స్థలాల కేటాయింపు గందరగోళంగా మారింది.
టీ-హబ్‌లో ఇతర కార్యాలయాలు వద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
అద్దె భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు.. ప్రభుత్వ భవనాల్లో స్థలం కేటాయింపుపై గందరగోళం
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వవిభాగాలు, కార్యాలయాలకు.. ఇతర ప్రభుత్వ భవంతులలో స్థలాల కేటాయింపు గందరగోళంగా మారింది. సంబంధం లేని భవనాల్లో స్థలం ఇవ్వడం, పనిచేయాల్సిన ప్రదేశానికి దూరంగా కేటాయించడంపై విమర్శలు వచ్చా యి. ఐటీ ఆవిష్కరణలకు కేంద్రమైన టీ-హబ్ భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల (ఎస్సార్వో)కు స్థలం కేటాయించడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికితోడు కొన్ని విభాగాలకు కేటాయించిన భవనాల్లో పేర్కొన్న మేరకు స్థలం అందుబాటు లేదని, కొన్ని విభాగాలు వేరే చోట్ల స్థలాలు ఇవ్వాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో స్థలాలు, భవనాల కేటాయింపుపై ఉన్నతాధికారులు పునః పరిశీలన చేపట్టినట్టు తెలిసింది. ఈ స్థలాల కేటాయింపులు గందరగోళంగా ఉన్నాయని, ముఖ్యం గా టీహబ్ భవనంలో ఎస్సార్వో కార్యాలయాలకు స్థలం కేటాయించారనే దానిపై ‘ఆంధ్రజ్యోతి’ ముందే కథనాన్ని ప్రచురించింది. అందుకు తగినట్టే అధికారులు పునరాలోచన చేస్తున్నారు. టీ-హబ్, టీ-ఫైబర్, న్యాక్ భవనాల్లో ఇతర విభాగాలకు స్థలం కేటాయింపుపై తీవ్ర విమర్శలొచ్చాయి. టీ-ఫైబర్, చీఫ్ రిలేషన్ ఆఫీసర్ కార్యాలయాలకు టీ-హబ్‌లో స్థలం కేటాయించాల్సి ఉన్నా.. ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)’ భవనంలో ఇచ్చారు.
అదే సమయంలో టీ-హబ్‌లో సబ్ రిజిస్ట్రార్, వాణిజ్య పన్నుల కార్యాలయాలకు స్థలం కేటాయించారు. ఇక టీ-వర్క్స్ పేరు తో సొంత భవనమేఉన్నా.. ఆ కార్యాలయానికి న్యాక్ భవనంలో స్థలం ఇచ్చారు. మరోవైపు నాంపల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని మనోరంజన్ భవనానికి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున అద్దెకు ఇవ్వకుం డా ఖాళీగా ఉంచారని సమాచారం. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండానే వాణిజ్య పన్నుల శాఖ పంజాగుట్ట, సికింద్రాబాద్, అబిడ్స్ డివిజన్ కార్యాలయాలకు అందులో 1,65,000 చదరపు అడుగుల స్థలం కేటాయించారు. ఇక ప్రస్తుతం అద్దెప్రాతిపదికన ఉంటున్న ప్రభుత్వ విభాగాలు సంబంధిత ప్రైవేటు భవనాల యజమానులతో చేసుకున్న ఒప్పందాల అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. రూ.లక్షల విలువ చేసే అడ్వాన్సులు ప్రైవేటు యజమానుల దగ్గర ఉన్నాయని, దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తులు వస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే పునఃపరిశీలన చేపట్టారు. పక్కాగా కసరత్తు చేసి.. రెండు, మూడు రోజుల్లో భవనాలు, స్థలాల కేటాయింపును ప్రకటించనున్నట్టు తెలిసింది. గడువు విషయంలో నూ సడలింపు ఇచ్చేఅవకాశం ఉందని సమాచారం.
అద్దెలు చెల్లిస్తారా.. ఉచితమా?
హౌసింగ్ బోర్డు, హెచ్‌ఎండీఏ ప్రభుత్వ భవనాలే అయినా.. వాటిలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అద్దెప్రాతిపదికన కొనసాగుతున్నాయి. అలాంటి చోట్ల తాజా కేటాయింపులు ఉచితమా, అద్దె చెల్లిస్తారా అన్న స్పష్టత లేదు. హౌసింగ్ బోర్డు పరిధిలోని భవనాల్లో మొత్తం 2,58,535 చదరపు అడుగుల స్థలాన్ని వివిధ ప్రభుత్వ కార్యాలయాల కోసం కేటాయించారు. బోర్డు వసూలు చేస్తున్న అద్దె చదరపు అడుగుకు రూ.50.53 చొప్పున ఈ స్థలానికి నెలకు రూ.కోటీ 30లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని అంచనా.
టీ-హబ్‌ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలి: సీఎం రేవంత్
టీ-హబ్‌లో సబ్‌రిజిస్ట్రార్, వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ కార్యాలయాలకు స్థలం కేటాయించడంపై సీఎం రేవంత్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఈ అంశంపై ప్రభుత్వ సీఎస్ రామకృష్ణారావుతో మాట్లాడారు. టీ-హబ్‌ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ఆదేశించారు. ఇంక్యుబేటర్, ఇన్నోవేషన్‌లకు ఉత్ర్పేరకంగా, స్టార్ట్‌పలకు కేంద్రంగా ఏర్పాటుచేసిన టీ- హబ్‌లో ఇతర ఆఫీసులు ఉండకూడదని.. అలాంటి ప్రతిపాదనలు ఉంటే విరమించుకోవాలని సూచించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలన్నారు. అయితే టీహబ్ ఖాళీగా ఉండడంతోనే ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాన్ని కేటాయించాలని అధికారులు భావించినట్టు తెలిసింది. సాధారణంగా టీ-హబ్‌లో ఏర్పాటయ్యే స్టార్ట్‌పలు తమ ఆవిష్కరణలు కార్యరూపం దాల్చిన తర్వాత సొంత ఆఫీసును ఏర్పాటు చేసుకుని వెళ్లిపోతుంటాయి. అదే సమయంలో కొత్త స్టార్ట్‌పలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఒక్కోసారి స్థలం ఖాళీగా ఉండేందుకు అవకాశముందని.. వృధాగా ఉందనే ఉద్దేశంతో ఇతర కార్యాలయాలకు కేటాయిస్తే టీహబ్ ఉద్దేశానికి భంగం వాటిల్లుతుందని అధికార వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.