మన నీళ్లు మనకే
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:03 AM
రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వచ్చే నీళ్లు మనవి మనకే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క రాష్ట్రాలకు వెళ్ల కూడదని సీఎం రేవంత్ అధికారులతో అన్నారు.
నారింజ వాగు ప్రాజెక్టు నీళ్లు అందులోనే ఆగాలి
కర్ణాటకలోని కారంజ ప్రాజెక్టుకు వెళ్లనివ్వొద్దు
చెక్‌డ్యామ్‌లు నిర్మించాలి
రిజర్వాయర్‌కు మరమ్మతులు చేయాలి
సీఎం రేవంత్ ఆదేశం
మరమ్మతులకు రూ.3కోట్లు
12 వరకు టెండర్లకు చాన్స్
హైదరాబాద్/జహీరాబాద్/జహీరాబాద్ రూరల్, ఆగష్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వచ్చే నీళ్లు మనవి మనకే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క రాష్ట్రాలకు వెళ్ల కూడదని సీఎం రేవంత్ అధికారులతో అన్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం కొత్తూర్-బి దగ్గరున్న ‘నారింజ వాగు’ ప్రాజెక్టు నీళ్లు అందులోనే ఆగాలని, ఆ నీటిని కర్ణాటకలోని ‘కారంజ’ ప్రాజెక్టుకు వెళ్లనివ్వొద్దని ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలన్నారు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కొన్ని గ్రామాలకు నీటి సరఫరా కోసం రూపొందించిన ప్రతిపాదనలను అధికారులకు సీఎం వివరించారు. ఇందులో భాగంగా నారింజ వాగు ప్రాజెక్టు విషయం చర్చకు వచ్చింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం, ప్రస్తుత పరిస్థితితోపాటు నీళ్లు కర్ణాటకకు వెళ్లి.. మళ్లీ అవి తిరిగి వేరే ప్రాంతాల గుండా రాష్ట్రంలోకి వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో ఆ నీటిని ఇకపై కారంజ ప్రాజెక్టుకు వెళ్లకుండా ముందుగానే వరుస చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తే.. మన నీళ్లు మనకే ఉంటాయని సీఎం అన్నారు. అదే సమయంలో నారింజ రిజర్వాయర్‌కు మరమ్మతులు చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.3.08 కోట్లను మంజూరు చేసింది.
640 ఎకరాల్లో ప్రాజెక్టు..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూర్-బి దగ్గర నారింజ వాగుపై 640 ఎకరాల విస్తీర్ణంలో, 0.085 టీఎంసీల (85 మిలియన్ క్యూబిక్ అడుగులు) నీటి నిల్వ సామర్థ్యంతో 1972లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీనికి 17 అడుగుల ఎత్తుతో ఏడు గేట్లను ఏర్పాటు చేశారు. జహీరాబాద్, న్యాల్‌కల్ మండలాల్లో 3,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం. జహీరాబాద్, ఝరాసంగం, కోహీర్, న్యాల్‌కల్ మండలాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లితే.. నారింజ వాగు ప్రాజెక్టుకు నీరు చేరుకుంటుంది. అయితే.. కాల్వలు లేకపోవడంతో ప్రాజెక్టు నిండితే నీటిని కిందికి వదలాల్సి వస్తోంది. దాంతో ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం పరిధిలో ఉన్న కారంజ ప్రాజెక్టుకు ఈ నీరు వెళుతోంది. ఆయకట్టుకు నీటిని అందించడానికి 15 కిలోమీటర్ల మేర కుడి, ఎడమ కాల్వలు తవ్వించినా.. వాటిని అసంపూర్తిగా వదిలేశారు. దీంతో ఇప్పటివరకు కాల్వల ద్వారా గుంట భూమికి కూడా సాగునీరు పారిన దాఖలాలు లేవు. ప్రాజెక్టుకు తూతూమంత్రంగా మరమ్మతులు చేపట్టడం తప్పితే.. ఏనాడూ ఆధునికీకరణ చేపట్టలేదు. దీంతో ప్రాజెక్ట్ గేట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వరద ప్రవాహం ధాటికి గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం నెలకొంది. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రూ.14 కోట్లతో మరమ్మతులు చేపట్టాలని ప్రతిపాదనలను పంపించారు. కానీ, ప్రభుత్వం ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతులు చేపట్టడానికి రూ.3,08,57,338 నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రాజెక్ట్‌కు కొత్త గేట్లు బిగించడం, గేట్లను ఎత్తి, దించే హూయిస్ట్ ప్లాట్‌ఫాంను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇంకా అవసరమైన మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ పనులు చేపట్టేందుకు ఈ నెల 12 వరకు టెండర్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. 17న ప్రైస్ బిడ్ తెరవనున్నట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. టెండర్ పొందిన కాంట్రాక్టర్ వెంటనే పనులు ప్రారంభించి తొమ్మిది నెలల్లో పనులు పూర్తిచేయాలని గడువు విధించారు.