Share News

పారిశ్రామిక పార్కులకు భూసేకరణపై దృష్టి పెట్టండి

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:57 AM

పారిశ్రామిక పార్కులకు అవసరమైన భూసేకరణపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

పారిశ్రామిక పార్కులకు భూసేకరణపై దృష్టి పెట్టండి

  • అలసత్వం వహిస్తే బదిలీ తప్పదు.. కలెక్టర్లకు సీఎం హెచ్చరిక

  • సెప్టెంబరు 30లోగా 5-10 వేల ఎకరాలు సేకరించాలని ఆదేశం

వికారాబాద్‌//కొడంగల్‌/దుద్యాల, జూలై 21 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక పార్కులకు అవసరమైన భూసేకరణపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి భూసేకరణ పూర్తిచేయాలని.. ఈ విషయంలో అలసత్వం వహిస్తే బదిలీ చేస్తామని ఆయన హెచ్చరించారు. దుద్యాల మండలం, హకీంపేట - పోలేపల్లి ఎడ్యుకేషనల్‌ హబ్‌లో కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై మంగళవారం సాయంత్రం ఆయన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ఎడ్యుకేషనల్‌ హబ్‌ ఏర్పాటైతే అక్కడ 7 వేల మంది దాకా విద్యార్థులు చదువుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఎడ్యుకేషనల్‌ హబ్‌, ఇండస్ట్రియల్‌ పార్కులు పూర్తయితే చదువుకునే విద్యార్థులకు, ఉద్యోగులకు అవసరమైన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో.. ఇండస్ట్రియల్‌ పార్కులు, ఎడ్యుకేషనల్‌ హబ్‌, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి సెప్టెంబరు 30లోగా కనీసం 5 వేల నుంచి 10 వేల ఎకరాల భూములను సేకరించాలని సీఎం ఆదేశించారు. అలాగే.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి కొడంగల్‌ కనెక్టివిటీ రోడ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. మక్తల్‌-నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అదనపు పంపుల ఏర్పాటుకు అవసరమైన సివిల్‌ పనులకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చి పూర్తి చేయాలని అఽధికారులను ఆదేశించారు. రంగారెడ్డి-వికారాబాద్‌-నారాయణపేట ఔటర్‌ రింగ్‌ రోడ్ల నిర్మాణంలో అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో చర్చించి డిజైన్లు రూపొందించాలని సీఎం ఆదేశించారు. 2028, జూన్‌ 2నాటికి కొడంగల్‌ నియోజకవర్గం రోడ్లన్నీ పూర్తి కావాలన్నారు. ఆ తర్వాత ఆర్‌అండ్‌బీ రోడ్లకు నిధులు ఖర్చు చేద్దామన్నా అవకాశం లేనంతగా రోడ్లు ఉండాలన్నారు. ప్రతి తండాకూ రోడ్లు ఉండాలని, అవసరమైతే తాను సందు.. సందు తిరుగుతానని స్పష్టం చేశారు.

Updated Date - Jul 22 , 2026 | 05:57 AM