దేవాదుల సామర్థ్యాన్ని భవిష్యత్తులో 100టీఎంసీలకు పెంచేలా కసరత్తు చేయండి
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:22 AM
దేవాదుల ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని భవిష్యత్తులో 100 టీఎంసీలకు పెంచడానికి వీలుగా అవసరమైన కసరత్తు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): దేవాదుల ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని భవిష్యత్తులో 100 టీఎంసీలకు పెంచడానికి వీలుగా అవసరమైన కసరత్తు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ బాధ్యతను సీఎం కార్యదర్శి మాణిక్కరాజ్ కన్నన్, నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్‌లకు అప్పగించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును 38.16 టీఎంసీల సామర్థ్యంతో, 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును గోదావరి ఎత్తిపోతల పథకం పేరుతో 1995-2000 మధ్యకాలంలో తెరమీదికి తీసుకొచ్చారు. ప్రతీ సంవత్సరం జూన్ నుంచి నవంబరు వరకు 50 టీఎంసీలు తరలించి, 2 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. 2005లో దీనికి పర్యావరణ, అటవీ అనుమతి లభించింది. 2007లో సీడబ్ల్యూసీకి చెందిన టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ(టీఏసీ) అనుమతి లభించింది. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టు కోసం రూ.14,359 కోట్లను వెచ్చించారు. ఇటీవల సీఎం రేవంత్ ఈ ప్రాజెక్టును సందర్శించినప్పుడు.. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 100 టీఎంసీలకు పెంచాలని విజ్ఞప్తులు రావడంతో సానుకూలంగా స్పందించి తాజా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో హన్మకొండ, వరంగల్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, ములుగు జిల్లాల్లో 3దశల్లో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.