‘డిజిటల్ గవర్నెన్స్’తో మెరుగైన పాలన
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:21 AM
పాలనలో పారదర్శకత కోసం డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, అవసరమైన చట్టాలను రూపొందించాలని సూచించారు.
కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకూ 1వ తేదీనే వేతనాలు
వివరాలను డిజిటలైజ్ చేయండి
ఈ ప్రక్రియ అమలుకు ప్రత్యేక కమిటీ
ఉద్యోగుల సమస్యలపై సమీక్షలో అధికారులకు రేవంత్ ఆదేశాలు
ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించని ఏజెన్సీలపై చర్యలు
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): పాలనలో పారదర్శకత కోసం డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, అవసరమైన చట్టాలను రూపొందించాలని సూచించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మంగళవారం ఆయన కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతోపాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఒకటో తేదీన జీతాలు అందించేందుకు వివరాలను డిజిటలైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాల్లోని కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంకు ఖాతాల వివరాలను డిజిటలైజ్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో సుమారు 4800 కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా ఇందులో 4300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు సీఎంకు వివరించారు. ఏజెన్సీలకు ప్రభుత్వం సొమ్ములు ఇచ్చినా.. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్‌తో ఈ సమస్యకు అడ్డుకట్ట వేయాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెలా 1 నుంచి 5లోపు పారదర్శకంగా జీతాలు చెల్లించేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. డిజిటలైజేషన్ ప్రక్రియను అమల్లోకి తెచ్చేందుకు వీలుగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
ఈ కమిటీ 100 రోజుల్లో ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకురావాలని చెప్పారు. హెల్త్ కార్డులు, ఇతర ప్రయోజనాలను అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలని సూచించారు. నిరంతర పర్యవేక్షణకు గాను ఆర్థిక శాఖ నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సీఎం చెప్పారు.
3వేల కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం
రాష్ట్రప్రభుత్వం రూ.3000కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వుబ్యాంకు మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. 7.97శాతం వార్షిక వడ్డీ, 17 ఏళ్ల కాల పరిమితితో రూ.1500 కోట్లు, 8.07శాతం వార్షిక వడ్డీ, 30 ఏళ్ల కాలపరిమితితో రూ.1500కోట్ల చొప్పున రుణాన్ని తీసుకుంది.