Share News

హైదరాబాద్‌ వచ్చాక మాట్లాడతా

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:21 AM

రాజకీయ కారణాలతో కేంద్ర ప్రభుత్వం తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం బోస్టన్‌కు వెళ్లకుండా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైనట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌ వచ్చాక మాట్లాడతా
Revanth reddy

  • అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణపై రేవంత్‌

  • అండగా నిలిచిన పార్టీకి, ప్రజలకు కృతజ్ఞతలు

  • ‘తెలంగాణ రైజింగ్‌ ’ను ప్రచారం చేయండి

  • లండన్‌లో తెలుగు ప్రవాసులకు పిలుపు

హైదరాబాద్‌: రాజకీయ కారణాలతో కేంద్ర ప్రభుత్వం తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం బోస్టన్‌కు వెళ్లకుండా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైనట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత ఈ అంశానికి సంబంధించి అన్ని విషయాలపైనా మాట్లాడతానని ‘ఎక్స్‌’ వేదికగా రేవంత్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు బలమైన మద్దతు తెలిపిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానన్నారు. అలాగే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తనకు మద్దతుగా నిలిచిన తమ పార్టీకి, నాయకులందరికీ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకొంటున్నానన్నారు. గత మూడు రోజులుగా తనకు లభించిన అపారమైన మద్దతుకు తాను రుణపడి ఉన్నానని తెలిపారు. లండన్‌లో తన అన్ని సమావేశాలు, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశానని పేర్కొన్నారు. మరోవైపు ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్‌లోని తెలుగు ప్రవాసులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి లండన్‌లోని తెలుగు ప్రవాసులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్‌ ప్రగతిపై వారితో చర్చించిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారిని కోరారు. తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను బలంగా ప్రచారం చేయడంతోపాటు రాష్ట్రానికి మంచి రాయబారులుగా నిలవాలని తెలుగు ప్రవాసులను ముఖ్యమంత్రి కోరినట్లు సీఎం కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - Aug 24 , 2026 | 05:37 AM