రాజకీయ జన్మనిచ్చిన నేలకు కృతజ్ఞతగా..
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:19 AM
తనకు రాజకీయంగా జన్మనిచ్చిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రుణం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారు.
4న సీఎం రేవంత్ మిడ్జిల్ పర్యటన
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): తనకు రాజకీయంగా జన్మనిచ్చిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రుణం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారు. ప్రజాప్రతినిధిగా తన తొలి అడుగుకు అండగా నిలిచిన ఆ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించారు. జడ్పీటీసీ సభ్యుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు సాగిన తన రాజకీయ ప్రయాణాన్ని 2006 జూలై 4న మిడ్జిల్ నుంచే ప్రారంభించారు. తన రాజకీయ జీవితంలో 20 ఏళ్ల మైలురాయిని పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఈ జూలై 4న ఆయన మిడ్జిల్‌లో భారీ ‘కృతజ్ఞత సభ’ నిర్వహించనున్నారు. మిడ్జిల్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా ప్రసిద్ధ ఊరుకొండ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. ఆ తర్వాత తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన అనుచరులు, ఆత్మీయులు, ముఖ్య నేతలు, ఆనాటి పెద్దలతో కలిసి మధ్యాహ్నం ఆత్మీయ విందు (భోజనం) ఆరగిస్తూ ముచ్చటించనున్నారు. మిడ్జిల్ సమీపంలో ఆనాటి రాజకీయ నేత గోపాల్‌రెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. చివరగా మిడ్జిల్‌లో భారీ ఎత్తున ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తొలి గెలుపునిచ్చిన నేలపై నుంచి ప్రజలకు నమస్కరిస్తూ, కృతజ్ఞతలు చెప్పబోతున్న ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంలోనే ఒక ప్రత్యేకమైన, భావోద్వేగ ఘట్టంగా నిలవనుంది.