నేడు మిడ్జిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:44 AM
సరిగ్గా 20 ఏళ్ల కిందట తనకు ప్రజాప్రతినిధిగా జన్మనిచ్చిన మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి మిడ్జిల్‌కు వెళ్లనున్నారు.
ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానానికి... జన్మనిచ్చిన నేలకు కృతజ్ఞతలు తెలిపేందుకే
ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు
పలు అభివృద్ధి పనులకూ శంకుస్థాపనలు
గోపాల్‌రెడ్డి, అంబేడ్కర్ విగ్రహాల ఆవిష్కరణ
బహిరంగ సభలోనూ పాల్గొననున్న సీఎం రేవంత్
హైదరాబాద్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): సరిగ్గా 20 ఏళ్ల కిందట తనకు ప్రజాప్రతినిధిగా జన్మనిచ్చిన మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి మిడ్జిల్‌కు వెళ్లనున్నారు. ప్రజా ప్రతినిధిగా తన తొలి విజయాన్ని అందించిన మిడ్జిల్‌కు.. సీఎం హోదాలో వెళ్లడం రాజకీయంగా ప్రత్యేకతను సంతరించుకుంది. అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలపడంతో పాటుగా పలు అభివృద్ధి పనులకూ శంకుస్థాపనలు చేయనున్నారు. శనివారం ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూల్ జిల్లాకు సీఎం రేవంత్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 12.30కు ఊర్కొండపేట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ ఆవరణలో తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన ఆనాటి అనుచరులు, ముఖ్య నేతలు, ఆనాటి పెద్దలతో మాటామంతీ జరపనున్నారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఊర్కొండపేట నుంచి రోడ్డు మార్గంలో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌కు సీఎం బయలుదేరుతారు. 2.45 గంటలకు మిడ్జిల్ మండలం వెలిజాల ఎక్స్‌రోడ్‌కు చేరుకుని దివంగత స్థానిక సీనియర్ నేత గోపాల్‌రెడ్డి, అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు.
అక్కడి నుంచి మిడ్జిల్ బహిరంగ సభా ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం 3.15 గంటలకు మిడ్జిల్‌లో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2006 జూన్ 4న మిడ్జిల్ జడ్పీటీసీగా గెలిచి ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రేవంత్ రెడ్డి, 20 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ అదే నేలపై ముఖ్యమంత్రిగా ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. మిడ్జిల్ జడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తొలి విజయాన్ని అందుకున్న రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, టీపీసీసీ చీఫ్‌గా.. తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయి దాకా సాగిన సంగతి తెలిసిందే.