సీఎం రేవంత్‌తో యూఎస్ డెలావర్ గవర్నర్ భేటీ
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:44 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో అమెరికాలోని డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
డెలావర్‌ను సందర్శించాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో అమెరికాలోని డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, విద్యా రంగాల్లో సంస్కరణలపై రేవంత్‌తో మాట్ మేయర్ చర్చించారు. డెలావర్‌లో పేద, మధ్య తరగతి ప్రజలకు అందిస్తున్న ఇళ్లు, రుణమాఫీ వంటి పథకాల గురించి సీఎంకు వివరించారు. అలాగే డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్ వంటి అంశాలపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగింది. తెలంగాణ ప్రతినిధుల బృందంతో కలిసి డెలావర్ రాష్ట్రాన్ని సందర్శించాలని మాట్ మేయర్ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. భవిష్యత్తులో తెలంగాణ-డెలావర్ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ-2047 విజన్ డాక్యుమెంట్‌ను సీఎం రేవంత్ మాట్ మేయర్‌కు అందజేశారు. సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డెలావర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.