Share News

సీఎం రేవంత్‌ కాన్వాయ్‌లో వాహనాల కుదింపు!

ABN , Publish Date - May 14 , 2026 | 04:16 AM

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో వాహనాలు తగ్గనున్నాయా? ప్రస్తుతం 9 వాహనాలతో ఉన్న కాన్వాయ్‌.. 4-5 వాహనాలకే పరిమితం కానుందా? అంటే ఔననే అంటున్నాయి సంబంధిత వర్గాలు.

సీఎం రేవంత్‌ కాన్వాయ్‌లో వాహనాల కుదింపు!

  1. ప్రస్తుతం 9 వాహనాలతో కాన్వాయ్‌.. 4 లేదా 5కు తగ్గే చాన్స్‌

  2. ఎన్ని తగ్గించాలనే దానిపై కసరత్తు.. నేడో, రేపో తుది నిర్ణయం

  3. తాజాగా ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి మూడు వాహనాలతో వెళ్లిన సీఎం

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో వాహనాలు తగ్గనున్నాయా? ప్రస్తుతం 9 వాహనాలతో ఉన్న కాన్వాయ్‌.. 4-5 వాహనాలకే పరిమితం కానుందా? అంటే ఔననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. ఇరాన్‌-అమెరికా యుద్ధం నేపథ్యంలో దేశంలోనూ పెట్రోల్‌, డీజీల్‌ వినియోగం తగ్గించేందుకు కేంద్రం పలు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌ కూడా తన కాన్వాయ్‌లో వాహనాలను కుదించుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు భద్రతా వ్యవహారాలను చూసే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం కాన్వాయ్‌లో ఎన్ని వాహనాలు తగ్గించాలనే దానిపై పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఈ అంశంపై గురు, శుక్రవారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ఆ వెంటనే వాహనాల కుదింపు నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు తెలిసింది. కాగా, బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)కి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు 3 వాహనాల కాన్వాయ్‌తోనే సీఎం వెళ్లినట్లు సమాచారం. ఈ మేరకు సీఎం రేవంత్‌ కాన్వాయ్‌ని 3-4 వాహనాలకు కుదించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే, మంత్రుల కాన్వాయ్‌ల్లోనూ ఎన్ని వాహనాలను తగ్గించాలనే అంశంపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

Updated Date - May 14 , 2026 | 04:16 AM