Share News

తాతామనుమళ్ల మధ్య ఆప్యాయతకు పూరీలు పొంగాయ్‌!

ABN , Publish Date - Jul 10 , 2026 | 06:23 AM

సీఎం రేవంత్‌ మనుమడు మారాం చేశాడు! ఆట బొమ్మలు కొనివ్వాలనో, తనను ఎక్కడికైనా తీసుకెళ్లాలనో కాదు.. పూరీలు కావాలని! అదీ.. ‘నువ్వు స్వయంగా చేస్తేనే తింటాను తాతా’ అని గారాలుపోయాడు!

తాతామనుమళ్ల మధ్య ఆప్యాయతకు పూరీలు పొంగాయ్‌!

  • రేయాన్ష్‌ కోసం స్వయంగా పూరీలు చేసి పెట్టిన రేవంత్‌

  • బీజీలైఫ్‌లో ఇదో మధురజ్ఞాపకం.. ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన సీఎం

ఇంటర్నెట్ డెస్క్: సీఎం రేవంత్‌ మనుమడు మారాం చేశాడు! ఆట బొమ్మలు కొనివ్వాలనో, తనను ఎక్కడికైనా తీసుకెళ్లాలనో కాదు.. పూరీలు కావాలని! అదీ.. ‘నువ్వు స్వయంగా చేస్తేనే తింటాను తాతా’ అని గారాలుపోయాడు! రేవంత్‌కు తప్పలేదు! మనుమడు అలా శాసింంచేసరికి పాటించారు. బిజీ షెడ్యూల్‌ను కాస్త పక్కనబెట్టేసి నలభీములను తనలో అవహించుకున్నట్లుగా సిద్ధమైపోయారు! మనుమడు రేయాన్ష్‌ను కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌పై కూర్చోబెట్టారు. పూరీపిండిని తానే కలిపి సిద్ధం చేశారు. అప్పడాల కర్రతో పూరీలు తయారు చేశారు. వాటిని ఒక్కొక్కటిగా బాణలిలో మరగుతున్న నూనెలో వేశారు. తాతామనుమళ్ల మధ్య ఆప్యాయతను చూసి కావొచ్చు ఆ పూరీలు మరింతగా పొంగాయి! రేవంత్‌, రేయాన్ష్‌ మనసులు అంతకుమించి ఉప్పొంగాయి. తానడిగిందే తడువు కోరిన టిఫిన్‌ను తాత చేసిపెట్టారని ఆ బుజ్జాయి... ముద్దుల మనుమడికి కొసరి కొసరి తినిపిస్తూ చిన్నారి అడిగిందే తరువాయి హామీని నెరవేర్చానని తాత.. ఇద్దరూ ఖుషీ అయ్యారు. అంతకుముందు పూరీలు వేస్తున్న తాతను ఉద్దేశించి అవి గుండ్రంగా రావడం లేదని.. సరిగ్గా చేయాలని రేయాన్ష్‌ సూచించాడు. మనుమడు అలా వచ్చీరాని మాటలతో సూచనలు చేసే సరికి ‘రౌండ్‌గా వేస్తా’ అంటూ రేవంత్‌ మరింత శ్రద్ధ పెట్టారు. ‘పూరీ పొంగింది చూడు చిన్నయ్యా..! ఇక చాలా’ అని రేవంత్‌ అడగ్గా.. ‘మరి అమ్మమ్మ కోసమూ చెయ్‌’ అంటూ ఆ చిన్నారి ‘సరిపోవు.. ఇంకా కావాలి’ అని చెప్పకనే చెప్పాడు. అలా రేయాన్ష్‌తో మాట్లాడుకుంటూ రేవంత్‌ ఓపిగ్గా పన్నెండు పూరీలు తయారు చేశారు. వంట గదిలో తాతామనుమళ్ల మధ్య సంభాషణ తాలూకు వీడియో ఒకటి నెటిజెన్లను ఆకట్టుకుంటోంది. మనుమడు పక్కనుండగా తాను పూరీలు వేస్తున్న ఫొటోను సీఎం రేవంత్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దాని కింద ఆసక్తికరమైన వ్యాఖ్యలూ చేశారు. ‘తాతా.. నువ్వు పూరీలు చేస్తేనే తింటా అని మనుమడు అడిగితే తప్పుతుందా? పక్కన మనుమడు, చేతిలో పిడికెడు పిండి. దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజను పూరీలు! బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనుమడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన కొన్ని క్షణాలు మధురజ్ఞాపకాలు’ అని రేవంత్‌ రాశారు.

- హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Jul 10 , 2026 | 06:25 AM