Share News

1,474 కోట్ల ప్రాజెక్టులకు నేడు సీఎం రేవంత్‌ శంకుస్థాపన

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:26 AM

మల్కాజ్‌గిరి మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ) పరిధిలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం 5 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.

1,474 కోట్ల ప్రాజెక్టులకు నేడు సీఎం రేవంత్‌ శంకుస్థాపన

ఉప్పల్‌ భగాయత్‌లో ఎంఎంసీ కార్యాలయ భవనం, కంటోన్మెంట్‌లో ‘ఏఓసీ రోడ్లు’, ఎల్‌బీనగర్‌లో వంతెన పనులకు శ్రీకారం

ఉప్పల్‌లో 100 పడకల ఆస్పత్రికి కూడా.. క్యూర్‌-1 యాప్‌ ఆవిష్కరణ

రేపు సీఎంసీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన

సీఎం చేతుల మీదుగానే బాచుపల్లిలో ఫ్లైఓవర్‌ ప్రారంభం..

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): మల్కాజ్‌గిరి మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ) పరిధిలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం 5 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.1,474 కోట్లతో మూడు వేర్వేరు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఎంఎంసీ ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్న నేపథ్యంలో మొదటిసారి భారీ ఎత్తున ప్రాజెక్టుల ప్రారంభానికి కార్పొరేషన్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో ప్రధానంగా కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌ (ఏఓసీ) రోడ్లకు ప్రత్యామ్నాయ రహదారులు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి రూ.960 కోట్లతో రహదారుల నిర్మాణానికి ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యింది. అలాగే ఎల్‌బీనగర్‌లోని టీకేఆర్‌ కళాశాల జంక్షన్‌ నుంచి గాయత్రినగర్‌, మందమల్లమ్మ జంక్షన్ల వరకు రూ.416 కోట్లతో ఆరు లేన్ల (బై డైరెక్షనల్‌) వంతెన నిర్మించనున్నారు. ఇక ఎంఎంసీకి నూతన కార్యాలయ భవనానికి ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌లో ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ భూమిలో స్టిల్ట్‌ ప్లస్‌ ఐదంతస్తుల భవనం నిర్మించేందుకు డిజైన్‌ సిద్ధం చేశారు. 30 వేల చదరపు అడుగుల్లో భవన నిర్మాణం జరగనుంది. 10 ఎకరాల్లో 25 నుంచి 30 శాతం భవన నిర్మాణం కోసం వినియోగిస్తామని, మిగతా స్థలంలో పచ్చదనం పెంచడానికి చర్యలు తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. ఔటర్‌ రింగు రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతానికి సంబంధించిన కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌)కి సంబంధించిన కొత్తగా క్యూర్‌-1 పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. క్యూర్‌ పరిధిలో ఉన్న జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల పరిధిలో పౌర సేవలన్నీ ఒకే వేదికపై ఉండేందుకు యాప్‌ను రూపొందించారు. ప్రజలు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన చెల్లింపులు క్యూర్‌-1 యాప్‌ ద్వారా ఒకే డిజిటల్‌ ఫ్లాట్‌ఫారంపై సులభంగా నిర్వహించుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే ఉప్పల్‌లో రూ.27.17 కోట్లతో 100 పడకల ఏరియా ఆస్పత్రికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, అజారుద్దీన్‌, పొన్నం ప్రభాకర్‌ పాల్గొనున్నారు.


రేపు సీఎంసీ కార్యాలయ భవనానికి కూడా..

కొత్తగూడలోని ఇజ్జత్‌నగర్‌లో సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) నూతన కార్యాలయ భవన నిర్మాణానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.161 కోట్ల అంచనా వ్యయంతో ప్రధాన కార్యాలయ భవనాన్ని అత్యాధునిక శైలిలో నిర్మించేందుకు సీఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీఎంసీ భవనం నిర్మాణం కోసం కేటాయించిన స్థలం మూడు ప్రధాన రోడ్లు కలిపే ప్రాంతంలో ఉంది. మాదాపూర్‌ నుంచి హైటెక్స్‌-హెచ్‌ఐసీసీ వెళ్లే మార్గంలో ఉన్న మొండికుంట దగ్గర సుమారు 4 ఎకరాల స్థలాన్ని సీఎంసీ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం కోసం కేటాయించారు. ఈ 4 ఎకరాల్లో 1.5 ఎకరాల స్థలంలో ప్రధాన కార్యాలయ భవనాన్ని జీ ప్లస్‌ 8 అంతస్తుల నుంచి 12 అంతస్తుల వరకు నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మిగిలిన 2.5 ఎకరాల స్థలం మొండికుంట చెరువు బఫర్‌ జోన్‌లో ఉండడంతో దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా కేవలం ల్యాండ్‌ స్కేపింగ్‌ చేసి పచ్చదనం కోసం ఉపయోగించుకోనున్నారు. ఇటు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బాచుపల్లి ఫ్లైఓవర్‌ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. మొత్తం రూ.141 కోట్ల వ్యయంతో 1.3 కిలోమీటర్ల మేర 4 నాలుగు లైన్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో బాచుపల్లి, బౌరంపేట, మల్లంపేట, మియాపూర్‌, గండిమైసమ్మ, ప్రగతినగర్‌ పరిసర ప్రాంతాల ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రానుండటంతో మియాపూర్‌-గండిమైసమ్మ మార్గంలో వెళ్లే వాహనదారులు ఇక బాచుపల్లి జంక్షన్‌లో ఆగే పరిస్థితే ఉండదు.

Updated Date - Jun 07 , 2026 | 06:26 AM