Share News

రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే..

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:08 AM

తెలంగాణ భవిష్యత్తు, రాష్ట్ర పునర్నిర్మాణం అద్దాల మేడల్లోనో... రంగుల గోడల్లోనో లేదని, తరగతి గదుల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే విద్యారంగానికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

రాష్ట్ర భవిష్యత్తు  తరగతి గదుల్లోనే..

  • విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నాం

  • బడ్జెట్‌లో 8.5 శాతం కేటాయిస్తున్నాం

  • ప్రభుత్వ పాఠశాలలపై నేటికీ తల్లిదండ్రుల్లో సందేహాలు

  • వాటిని తొలగించేందుకే తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు

  • నాణ్యమైన విద్యతోనే అసమానతలు దూరం

  • కులాల అడ్డుగోడలు కూల్చేందుకు అన్ని వర్గాల

  • విద్యార్థులకు కలిపి అంతర్జాతీయ స్థాయి స్కూళ్లు

  • క్రీడలకు ప్రోత్సాహం, ఉద్యోగ నైపుణ్యాల శిక్షణ: సీఎం

  • ఆరుట్లలో ‘తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌’ ప్రారంభం

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

తెలంగాణ భవిష్యత్తు, రాష్ట్ర పునర్నిర్మాణం అద్దాల మేడల్లోనో... రంగుల గోడల్లోనో లేదని, తరగతి గదుల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే విద్యారంగానికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 8.5 శాతం (రూ.27 వేల కోట్లు) విద్యారంగానికే ఖర్చు చేస్తున్నామని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను సీఎం బుధవారం ప్రారంభించారు. ‘పాఠశాలలో అల్పాహారం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి బ్రేక్‌ ఫాస్ట్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ‘విద్యారంగంపై పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తు పెట్టుబడి అని మేం సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. కానీ, ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలు వెళ్తే సరైన చదువురాదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకవనే అనుమానాలు ఇప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్నాయి. వీటిని తొలగించి తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకే తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నాం’ అని రేవంత్‌రెడ్డి వివరించారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ నుంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లను, ఈ రాష్ట్రాన్ని ఏలే నాయకులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించటం కోసం విద్యాకమిషన్‌ ఏర్పాటు చేసి చైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించామన్నారు.


ఆయన దేశమంతా పర్యటించటమేగాక ఇతర దేశాల్లోని విద్యావ్యవస్థలను కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించారని చెప్పారు. ఆ సూచనల మేరకు అన్ని హంగులతో పబ్లిక్‌ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని సీఎం వెల్లడించారు. విద్యనే ఆత్మగౌరవం, ఆయుధం అన్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడుస్తున్నామన్నారు. విద్య మాత్రమే మన జీవితాలను సమూలంగా మార్చగలదని, సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అవసరమని సీఎం ఉద్ఘాటించారు. ఆరుట్లలో అన్ని వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంకితం ఇస్తున్నామని సీఎం ప్రకటించారు. రాష్ట్రాన్ని విద్యారంగంలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.


కులాల అడ్డుగోడలు కూలగొడదాం

‘గతంలో ప్రభుత్వాలు తెలిసో తెలియకో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర వర్గాల విద్యార్థులకు వేర్వేరుగా రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లు నిర్మించాయి. దీనివల్ల విద్యార్థుల మధ్య కులాల గోడలు కట్టినట్లయ్యింది. కులనిర్మూలన జరగాలంటే ఈ అడ్డుగోడలను కూల్చాల్సిన అవసరం ఉంది. అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అందుకే యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లు, పబ్లిక్‌ స్కూళ్లలో అన్ని వర్గాల విద్యార్థులకు సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యనందించే ఏర్పాట్లు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫ్రభుత్వ స్కూళ్లలో చదవడం చిన్నతనంగా భావించవద్దని సీఎం హితవు పలికారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే ఐఏఎస్‌, ఐపీఎ్‌సలే కాదు.. దేశ ప్రధాని కూడా కావచ్చన్నారు. తాను కూడా ప్రభుత్వ స్కూల్‌లోనే చదువుకున్నానని, రాజకీయాల్లోకి వచ్చి 17 ఏళ్లు తిరగక ముందే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యానన్నారు. పీవీ నరసింహారావు, జైపాల్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి తదితర నేతలందరూ ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారేనన్నారు. చదువుకే పరిమితం కాకుండా నైపుణ్యాలపై (స్కిల్స్‌పై) కూడా విద్యార్థులు దృష్టిపెట్టాలని, వృత్తి నైపుణ్యం ఉన్న వారికే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. అందుకే ఫ్యూచర్‌సిటీలో స్కిల్‌ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని, దీనిని ఈ ఏడాది డిసెంబరు 9వ తేదీన ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆరుట్ల పబ్లిక్‌ స్కూల్‌లో 1814 మంది పిల్లలు చదువుతున్నారని, ‘అడ్మిషన్లు పూర్తయ్యాయి.. కొత్తవారిని తీసుకోవటం లేదు’ అని స్కూల్‌ బయట బోర్డు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ.. పాఠశాలపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో నెలకొన్న నమ్మకానికి ఇది నిదర్శమన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది అంకితభావాన్ని అభినందిస్తున్నానని సీఎం చెప్పారు.


ఆరుట్లకు గొప్ప చరిత్ర

తన సొంత మండలంలో కూడా పబ్లిక్‌ స్కూల్‌ను నిర్మించినా, తాను ఇక్కడకు వచ్చి ప్రారంభించడానికి కారణం.. ఆరుట్ల గ్రామానికి ఉన్న చరిత్ర అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన రామచంద్రారెడ్డి, కమలాదేవి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ఆదర్శంగా నిలిచారన్నారు. తమ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని.. 140 కోట్ల జనం ఉన్న మన దేశానికి ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్‌మెడల్‌ రాకపోవటం తలదించుకునే పరిస్థితి అని సీఎం చెప్పారు. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీనీ పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్నామన్నారు. ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీని హైదరాబాద్‌కు తీసుకొస్తే దానిపై కూడా విమర్శలు చేసే కుసంస్కారులు ప్రతిపక్షంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మెస్సీ ఎమైనా డ్రగ్స్‌ మాఫియా నడుపుతున్నాడా? బ్యాంకులు కొల్లగొట్టాడా? ప్రాజెక్టులు కట్టి కూల్చాడా? ఎందుకు మీకు అంత కడుపు మంట? అని ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు, కిట్‌లు ఇచ్చేందుకు టెండర్లు పిలిస్తే దానిపై కూడా రాద్ధాంతం చేస్తున్నారని సీఎం విమర్శించారు. రూ.685 కోట్లతో టెండర్లు పిలిచామని, దీంట్లో రూ.3వేల కోట్ల స్కామ్‌ జరిగిందని చదువుకున్న ఒకాయన అంటున్నారని.. ఇది ఎలా సాధ్యమని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. భవిష్యత్‌ తరాల కోసం విద్యావ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం పబ్లిక్‌ పాఠశాలలను నిర్మించటం హర్షణీయమని ఆకునూరి మురళి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.


విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం

ఆరుట్ల పబ్లిక్‌ స్కూల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థులతో ముచ్చటించారు. అల్పాహారం సందర్భంగా తన పక్కన కూర్చున్న 7వ తరగతి విద్యార్థి శ్రీనాథ్‌తో మాట్లాడుతూ.. బ్రేక్‌ఫాస్ట్‌ ఎలా ఉంది? మీ టీచర్లు ఎలా బోధిస్తున్నారు? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రీప్రైమరీ స్కూల్‌ను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. పబ్లిక్‌స్కూల్‌లోని తరగతి గదులు, ప్రయోగశాలలను పరిశీలించారు. డ్యాన్స్‌, మ్యూజిక్‌ రూమ్‌ను సందర్శించారు. విద్యార్థులతో కలిసి గిటార్‌ వాయించారు. ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో విద్యార్థులతో కొద్దిసేపు ఫుట్‌బాల్‌ ఆడి గోల్స్‌ కొట్టారు.

Updated Date - Jun 18 , 2026 | 05:10 AM