పిల్లల ఆహారం నాణ్యతపై రాజీ పడొద్దు
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:23 AM
రాష్ట్ర భవిష్యత్తు పిల్లలేనని, వారికి నాణ్యమైన భోజనం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పిల్లల ఆహారం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని..
వారు ఆరోగ్యంగా ఎదగడమే నిజమైన అభివృద్ధి
పౌష్టికాహారంపై ఖర్చుకు వెనకాడం
బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి
హైదరాబాద్ సిటీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భవిష్యత్తు పిల్లలేనని, వారికి నాణ్యమైన భోజనం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పిల్లల ఆహారం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, సంబంధిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆరోగ్యంగా ఎదిగి, సొంత కాళ్ల మీద నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దినప్పుడే తెలంగాణ నిజమైన అభివృద్ధి సాధించినట్లని చెప్పారు. మంగళవారం ఆయన నాచారం పారిశ్రామికవాడలో బాలమృతం ప్లాంటును మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలకు పథకాలు ఎన్ని ఇచ్చినా ఇంకా చాల్లేదని వస్తూనే ఉంటారని, ఆరోగ్యవంతమైన పిల్లలను తయారు చేస్తే శక్తిమంతమైన సమాజాన్ని నిర్మించిన వారమవుతామని చెప్పారు. ఓటేసే వారికే పథకాలు ఇవ్వాలని ప్రభుత్వాలు ఆలోచిస్తాయని, ఈసారి తమ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల ఆరోగ్యం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. రకరకాల సమస్యలతో ఈ స్థాయికొచ్చాం, సగం జీవితం గడచిపోయింది. మిగతా సగం అయినా పిల్లల భవిష్యత్తు మీద పెట్టుబడి పెడదాం అన్నారు. పిల్లలు వందేళ్లపాటు ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన భోజనం అందించే ఇలాంటి సంస్థలు రావాలన్నారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు ఆరు సంవత్సరాల వరకు పెరిగే వరకు బలవర్థకమైన పోషకాహారం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కడుపులో ఆకలి ఉంటే పిల్లలకు చదువు తలకెక్కదని, శ్రీమంతులు పొద్దున ఏమేమి బ్రేక్‌పాస్ట్ చేస్తారో అదే బడి పిల్లలకు అందిస్తామని చెప్పారు. పాలు, రాగిజావ, ఇడ్లీ, పూరి తదితర బ్రేక్‌పాస్ట్‌గా ప్రభుత్వ స్కూళ్లలో అందిస్తారన్నారు. తల్లిదండ్రులను ఆర్థికంగా కుంగదీస్తున్న విద్య ఖర్చును తగ్గించేందుకే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు.
నాణ్యమైన ఆహారం అందించడానికి పాఠశాలలో టీచర్లు అక్కడే భోజనం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏడాదికి రూ.27 వేల కోట్లు విద్యార్థుల చదువు మీద ఖర్చు చేస్తున్నామని, దాన్ని ఖర్చుగా భావించట్లేదని తెలిపారు. విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకొని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మల్కాజిగిరి ఎంపీగా ఉప్పల్ ప్రాంతానికి ఏమీ చేయలేక పోయానని, ముఖ్యమంత్రిగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.