సంక్షేమం, అభివృద్ధిలో రాజీలేదు
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:04 AM
సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా ప్రభుత్వం పని చేస్తోందని, పాలకులం కాదు.. సేవకులం అనే భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం..
ప్రజల జీవితాల్లో మార్పుకోసమే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ ప్రారంభం
ఇది సాధారణ కార్యక్రమం కాదు.. ఒక దీక్ష
గ్రామ సభలకు సీఎం రేవంత్ సందేశం
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా ప్రభుత్వం పని చేస్తోందని, పాలకులం కాదు.. సేవకులం అనే భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రమంతటా గురువారం జరిగిన గ్రామసభలకు సీఎం సందేశం అందించారు. ‘ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండేళ్ల 3 నెలలు పూర్తయింది. ఆర్ధిక సవాళ్లను అధిగమిస్తూ ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మీరిచ్చిన విజయాలు మా బాధ్యతను పెంచాయి’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే తమ సంకల్పమని, ఆ ఉద్దేశంతోనే ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రారంభించామని, మార్చి 6 నుంచి 99 రోజులపాటు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఉద్యమంలా సాగాలని ఆకాంక్షించారు. ‘‘ఇది ఒక సాధారణ కార్యక్రమం కాదు.. ఒక దీక్ష. నాలుగు కోట్ల ప్రజలు ఒక్కటై.. దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కల. ఆ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామికావాలి. అందుకు మీ సహకారాన్ని కోరుతున్నా’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు.